భారత్ న్యూస్ నెల్లూరు..పార్టీ కన్నా, పదవుల కన్నా నన్ను నమ్మిన ప్రజలే నాకు ముఖ్యం

Ammiraju Udaya Shankar.sharma News Editor…• పదవులు అలంకారం కాదు… బాధ్యత
• ప్రజల దగ్గర తలదించుకునే పరిస్థితిని తీసుకురావొద్దు
• రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నిస్తే సహించను
• సంఘవిద్రోహులకు వైసీపీ కొమ్ము కాస్తోంది
• అధికారులకు మళ్లీ చెబుతున్నా వైసీపీ మళ్లీ రాదు
• పిల్లలకు కులాలను అంటగట్టి రాజకీయం చేస్తున్నారు
• శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరును పోలవరం ప్రాజెక్టుకు పెట్టాలి
• పిఠాపురం నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం
• పదవి – బాధ్యత కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి కోసమే పని చేస్తాను. రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉంటూ, అరాచక మూకల ఆగడాలు ఆగాలి. రాష్ట్ర ప్రజల ముఖాల్లో సుఖసంతోషాలు నింపేందుకు ఎలాంటి నిర్ణయమైన, ఎన్ని రాజకీయ ఎత్తుగడలైనా వేస్తాను. నన్ను నమ్మి అతి పెద్ద బాధ్యత అప్పగించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాను. వారి దగ్గర తల దించుకునే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోను. నాతోపాటు జనసేన పార్టీ నుంచి ఎన్నిక అయిన వారు, నామినేటెడ్ పదవులు పొందిన వారు సైతం ప్రజల దగ్గర తలెత్తుకునేలా పనిచేయాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిసారీ బెదిరింపులకు దిగుతున్నారు. చంపేస్తాం అంటూ, మేమొస్తే అరెస్టులు చేస్తామంటూ బహిరంగంగా మాట్లాడటం ఓ తప్పుడు సంకేతమన్నారు. జనసేన పార్టీ నుంచి నామినేటెడ్ పదవులు పొందిన వారితో ప్రత్యేకంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన ‘పదవి-బాధ్యత’ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. పదవులు పొందిన వారితో బాధ్యతగా పనిచేస్తామని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ…
‘‘పార్టీ కోసం మొదట నుంచి క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి, పోరాటాలు చేసిన వారికి తగిన గుర్తింపు ఇచ్చాం. నామినేటెడ్ పదవుల ఎంపికలో ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా చూశాం. కూటమిలో భాగంగా ఇప్పటి వరకు జనసేనకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు లభించాయి. మరికొన్ని పదవులు త్వరలోనే భర్తీ అవుతాయి. ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యం ఇవ్వాలనేదే నా ఆకాంక్ష. పార్టీ కష్టకాలంలో మీరంతా నాకు దన్నుగా, పార్టీకి అండగా నిలిచారు. వారికి తగిన గౌరవం ఇవ్వడం సముచితం.
ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం ప్రాంతీయత, ఎన్నికల కోణంలోనే పార్టీల ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా జాతీయ దృక్పథంతో ఆలోచించే ప్రాంతీయ పార్టీ ఉండాలని జనసేన పార్టీని స్థాపించాను. యువత గళానికి ఈ పార్టీ వేదిక కావాలని ఆకాంక్షించాను. జనసేన పార్టీ ఐడియాలజీ, సిద్దాంతాలు బలమైనవి. పదిమందికీ ఉపయోగపడేవి. ఈ రోజు మన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఇంతమంది కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నారంటే దానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే కారణం కాదు. మనందరీ భావజాలం, పోరాటశక్తి, పోరాట పటిమ కారణం. రెండు మూడు కులాలతో కూర్చొని పార్టీని నడపలేం. అన్ని కులాలు కలిస్తేనే సమాజం. నేను ఏనాడు కులం కోసం పార్టీని పెట్టలేదు. నన్ను కులానికి పరిమితం చేసి మాట్లాడితే బాధగా ఉంటుంది. జనసేన పార్టీ మూల సూత్రాల్లో అంతర్లీనంగా చాలా పెద్ద భావజాలం ఉంది. భావితరాలకు ఉపయోగపడాలనే ఏడు సూత్రాలని ప్రతిపాదించాను.
• సామాజిక అవగాహన ముఖ్యం
ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగానికి కట్టుబడి పని చేస్తామని ప్రతిజ్ఞ చేసినపుడు భారతదేశానికి సంబంధించిన ప్రతి సమస్య మన సమస్యే అవుతుంది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకేంటీ అనుకోవద్దు. దాని వల్ల మన దగ్గర యూరియా ధరలు పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్ ప్రజలు మనదేశంలోకి వలస వస్తే మనకేమవుతుంది అనుకోవద్దు. ఇక్కడ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ప్రతీ విషయము మనకు అవసరమే. అన్నీ తెలిస్తేనే దేని గురించైనా బలంగా మాట్లాడగలం.
పదవి చిన్నదా? పెద్దదా? అనుకోకుండా జాగ్రత్తగా పని చేయండి. గతంలో పంచాయతీరాజ్ శాఖ పని ఎందరికి తెలుసు? కానీ ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఎలా పనిచేస్తోందనేది అందరికి తెలుస్తోంది. వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు. ఏ పదవి తక్కువ అనుకోవద్దు. ఏదీ ఎక్కువ అనుకోవద్దు.. నీటి సంఘాలు బాధ్యత సక్రమంగా నెరవేరిస్తే రైతుల కష్టాలు తెలుస్తాయి. ఉప ముఖ్యమంత్రి వరకు వస్తేనే చిన్న రోడ్డు సమస్య తీరుతుంది అంటే అక్కడ వ్యవస్థ ఫెయిల్ అయినట్లే. నా దగ్గరికి రాకుండానే పని పూర్తి కావాలి.
• యువత కోపమే నక్సలిజం అయింది
1970, 80 దశకాల్లో అప్పటి యువత వ్యవస్థలు, జరుగుతున్న అమానుషాలను చూసి నక్సలైట్లుగా మారారు. అడవుల బాట పట్టి, అక్కడి నుంచి తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుడు బలం అవుతున్నాడు. ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. ఒకరి చెప్పుచేతల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ మనమే చంపేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ ఉద్యమాన్ని కగార్ ఆపరేషన్ రూపంలో ఆపొచ్చు కానీ.. వ్యవస్థలపై ఉన్న కోపం మాత్రం ఎక్కడికీ పోదు. అది మరో రూపం తీసుకోవచ్చు. వ్యవస్థలను బతికించినపుడే ప్రజల బాధ, ఆవేదన తీరుతాయి. రాష్ట్రంలో నాశనమైన వ్యవస్థలకు జీవం పోయాలి. వాటి పని అవి బలంగా చేసేలా చూడాలి. అప్పుడు సమాజంలో కోపం కాకుండా, గౌరవం పెరుగుతుంది. యువతలో భవిష్యత్తు గురించి ఆశలు చిగురిస్తాయి.
త్యాగాలు చేసిన వారిని, పార్టీ కోసం కష్టపడిన వారిని మనం గుర్తించాలి. భాషాప్రయుక్త రాష్ట్రాలు తెచ్చిన మహానుభావుడు, తెలుగువారి కోసం కడదాకా పోరాడిన యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వారికి మనం గౌరవం ఇవ్వాలి. మొన్నటి వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెడితే వైశ్య కులం కోసం పెట్టామని కొందరు మాట్లాడుతారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తే కొన్ని కులాలకే ఆయనను పరిమితం చేస్తారు. జాతి నాయకులకు కులాలతో ముడిపెట్టడం ఏంటీ? వారంతా అందరి గుండెల్లో ఉంటారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం బలిదానం చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరును పోలవరం ప్రాజెక్టుకి పెట్టాలని నా ఆలోచన. అది కుదురుతుందో లేదో నాకు తెలిదు కానీ నా కోరిక మాత్రం అదే. దీనిపై కచ్చితంగా క్యాబినెట్ లో చర్చిస్తాను.
కేబినెట్ లో కూడా పర్యాటకం మీద ఓ కమిటీ వేశారు. దానికి ఛైర్మన్ గా వేశారు. ప్రాథమికంగా పర్యాటకం అభివృద్ది చేయాలంటే శాంతిభద్రతలు ప్రధానం. ఢిల్లీ నుంచి బైక్ రైడ్ చేస్తూ వచ్చిన ఓ యువతి శ్రీశైలం వెళ్తే కాటేజ్ ఇవ్వలేదు. ఒంటరి ఆడపిల్లలకు ఇవ్వం అని చెప్పారు. అది పాలసీ అని చెప్పారు. అది నా దృష్టికి వచ్చింది. అయితే తర్వాత వారిని గౌరవించి దర్శనం చేయించి పంపాను. అతిథులను గౌరవించి పంపాలి. పర్యాటకంలో కొన్ని మార్పులు రావాలి. ముఖ్యంగా సేఫ్టీ టూరిజం పాలసీ రావాలి అని బలంగా చెప్పాను. టూరిజం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో బలమైన శాంతిభధ్రతలు ఉండాలి. ప్రతిసారి 15 సంవత్సరాలు కూటమి ఉండాలి అంటాను అంటే ఎవర్నో తగ్గించాలి.. పెంచాలి అని కాదు. మొదట రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన తర్వాత.. ఏం జరుగుతుందో చూద్దాం.
• వైసీపీ… రౌడీల సమూహం
ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడితేనే అది రాజకీయ పార్టీ అవుతుంది. కానీ వైసీపీ నాయకులు మేము రాగానే అరెస్టులు చేస్తాం.. చంపుతాం అని బెదిరిస్తున్నారు. వారిని చూస్తే రౌడీల సమూహంలా అనిపిస్తుంది. నాకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. ఆ పార్టీ విధివిధానాలు ప్రజలకు ఇబ్బందిగా ఉంటే మాత్రం నేను గొడవపెట్టుకుంటాను. నా పోరాటం కూడా రాజ్యాంగ పరిధిలోనే ఉంటుంది. చివరి దశలో మాత్రమే గొడవ పెట్టుకుంటాం. ఆ గొడవ చాలా తీవ్రంగా ఉంటుంది. అది నా చివరి అస్త్రం. వాళ్లు సయోధ్యగా మాట్లాడితే నేను శాంతంగా ఉంటాను. వైసీపీ మళ్లీ వస్తే అనే భయం కొంతమంది అధికారుల్లో ఉంది. వాళ్లకు చెబుతున్నాను… వైసీపీ మళ్లీ రాదు.

తెనాలిలో గంజాయి తాగిన రౌడీలను పోలీసులు కొడితే న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు రౌడీలకు మద్దతుగా వెళ్లారు. పోలీసులు వీరి చర్యలకు భయపడ్డారు. ఏదైనా చేస్తే వీళ్లు మళ్లీ అసాంఘిక శక్తులకు మద్దతుగా వెళ్తారు… కేసులు వేస్తారని భయపడుతున్నారు. క్రిమినల్ ను దెబ్బ కొట్టకూడదు అంటే నేరాలు ఎక్కడ ఆగుతాయి..? ఓ కుటుంబం బయటకు వస్తే వారిని ఎవరైనా ఏడిపిస్తే ఎవరికి చెప్పుకుంటారు. పోలీసులు పని పోలీసులు చేసేలా వారికి అ…