భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….అంగన్వాడీ నియామకాల ప్రక్రియ వేగవంతం
సుప్రీం కోర్టు స్టేను తొలగించుకునేలా చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని మంత్రి సీతక్క ఆదేశాలు
లా సెక్రటరి, పీఆర్సీ చైర్మన్ తో సమావేశమైన మంత్రి సీతక్క
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నియామకాలకు ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు…
ఈ సమయంలో నియామకాలకు ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు…
ఈ మేరకు సచివాలయంలో మంగళవారం నాడు లా సెక్రటరీ బీ. పాపిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్, పీఆర్సీ చైర్మన్ ఎన్. శివశంకర్‌లతో మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల నియామకాల్లో ఎదురవుతున్న న్యాయ చిక్కులపై చర్చించారు. న్యాయ చిక్కులను అధిగమించే దిశలో వారి సలహలు, సూచనలు తెలుసుకున్నారు. సమావేశంలో శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు.
రాష్ట్రంలో సుమారు 14 వేల వరకు అంగన్వాడీ ఖాలీలుండగా, వాటి భర్తీపై గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్, హెల్పర్ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేసిన ప్రభుత్వం, చిన్నారులు తమ మాతృభాషలో నేర్చుకోవడం సులువవుతుందన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రిజర్వేషన్లు 50 శాతం మించిపోవడంతో, కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు స్టే విధించింది.
ఈ నేపథ్యంలో స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా లా సెక్రటరీ పాపిరెడ్డికి మంత్రి సీతక్క సూచించారు. రిక్రూట్‌మెంట్, సర్వీస్ రూల్స్‌లో నిపుణుడైన ఎన్. శివశంకర్ సలహాలతో ముందుకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు.
అయితే మంత్రి సీతక్క ఆదేశాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు..ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పర్యటించి అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ విధానాన్ని అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఆ రాష్ట్రాల్లో అంగన్వాడీ పోస్టులు ప్రభుత్వ సర్వీస్ కిందకు రాకపోవడం వలన సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్తించవని, దీంతో రిజర్వేషన్లు 50 శాతం పరిమితి వర్తించదని అధికారులు వివరించారు.
పోరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీ పోస్టులు ఎస్టీలకే రిజర్వ్ చేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి అనుగుణంగా తెలంగాణలోనూ అదే విధానాన్ని అవలంబించి సుప్రీం కోర్టు స్టేను వెకేట్ చేయించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేసి, స్టేను తొలగించుకునే చర్యలు వెంటనే ప్రారంభించాలని సూచించారు. సుప్రీం కోర్టు స్టేను తొలగించుకునేందుకు చట్టపరమైన చర్యలు ప్రారంభించి, 10 రోజుల్లో నియామక ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశలో కొత్త నియమాకాలు దోహద పడుతాయని..అందుకే అంగన్వాడీల నియమాకాలను సత్వరం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు…
