ఆపరేషన్ కగార్….

ఆపరేషన్ కగార్ ఎట్టి పరిస్తితుల్లో ఆగదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తేల్చిచెప్పడంతో బలగాలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాయి. ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో గాలిస్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్ట మధ్యలో పాగావేసిన బలగాలు మావోలకు సవాల్ విసురుతున్నారు. అయితే గుట్టను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న జవాన్లకు ల్యాండ్ మైన్లు తలనొప్పిగా మారాయి. ఎక్కడ ఏముందో తెలియక ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఓ జవాన్ ల్యాండ్ మైన్ మీద కాలు వెయ్యడం, అది పేలడంతో అతన్ని ఆర్మీ హెలికాప్టర్ ద్వారా జగల్పూర్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్తితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కూంబింగ్ చేస్తున్న దళాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో రెండు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్ట్ చనిపోయాడు. మిగిలిన వారు పారిపోయారు. అయితే చనిపోయిన మావోయిస్ట్ దగ్గర విటమిన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లేట్లు దొరకడం బలగాలను ఆశ్చర్యపరిచింది. అంటే, ఆహారం అందకపోతే విటమిన్ ఇంజక్షన్లతో ఓపిక తెచ్చుకోవచ్చన్నదే మావోయిస్టుల ఆలోచనగా అర్థం అవుతోంది. మరోవైపు కర్రెగుట్ట ఏరియాలోని గిరిజన గ్రామాల నుంచి మావోయిస్టులకు ఆహారం అందకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో జవాన్లు సక్సెస్ అయ్యాయి. మరోవైపు మావోయిస్ట్ సీనియర్ హిడ్మాను ఎట్టి పరిస్తితుల్లో ప్రాణాలతో పట్టుకోవాలని బలగాలు భావిస్తున్నాయి. కాకపోతే, ఇప్పటికే చనిపోయాడు, లేక కర్రెగుట్ట నుంచి పారిపోయాడా అన్నది తేలడం లేదు.