భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. అందుకు అందరం ప్రతిజ్ఞ తీసుకుందాం. ఈ తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాం. ఎజెండాలు, జెండాలు పక్కన పెట్టి ప్రభుత్వం ప్రణాళికా బద్ధం చేస్తున్న అభివృద్ధిలో కలిసిరండి. ఈ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.
ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అండగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తాం. ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, అందుకు మీ అందరి సహకారం, ఆశీర్వాదం ఉండాలి” అని ప్రజాపాలన దినోత్సవ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు.
నిజాం నియంతృత్వ పాలనపై సాయుధ పోరాటంతో సామాన్యుడు సాధించుకున్న విజయానికి గుర్తుగా సెప్టెంబర్ 17 న నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
“నిజాం నిరంకుశ పాలనపై జరిగిన పోరాటంలో 1948, సెప్టెంబర్ 17 రోజున ప్రజలు విజయం సాధించి, స్వేచ్ఛా పతాకను ఎగుర వేసిన రోజు. అందుకే ఇది ప్రజా పాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వం సంకెళ్లను బద్ధలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. అదే విధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలు రాయి. 77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను, ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని మేం ఈ రోజు పరిపాలన చేస్తున్నాం.
