.భారత్ న్యూస్ హైదరాబాద్….కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన చికిత తానిపర్తి వచ్చే ఒలింపిక్స్‌లో పోటీ పడేలా ప్రభుత్వ తరఫున పూర్తిస్థాయిలో శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌తో పాటు చైనాలోని షాంగైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు రజత పతకం సాధించిన చికితను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు.

ఒలంపిక్స్ లక్ష్యంగా సాధన చేయాలని, అందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి. భానుప్రసాద్ గారు, ఎమ్మెల్యే విజయ రమణా రావు గారు, తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ శివ సేనారెడ్డి గారు ఇతర ప్రతినిధులు ఉన్నారు.