శవంపై కూర్చున్న ఎలుగుబంటి… ఆదిలాబాద్ సరిహద్దులో భయానక ఘటన.ముగ్గురు మృతి – ఆరుగురిపై దాడి, అటవీ శాఖ హెచ్చరికలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…శవంపై కూర్చున్న ఎలుగుబంటి… ఆదిలాబాద్ సరిహద్దులో భయానక ఘటన

ముగ్గురు మృతి – ఆరుగురిపై దాడి, అటవీ శాఖ హెచ్చరికలు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలోని కైలాస్ టేకిడి ప్రాంతంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మొత్తం ఆరుగురిపై ఎలుగుబంటి దాడి చేసినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం, ఉపాధి పనుల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన వారిపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. దాడి తీవ్రతకు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. చనిపోయిన వ్యక్తి శవంపై ఎలుగుబంటి కూర్చున్న దృశ్యాలు అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేశాయి.

సమాచారం అందుకున్న అటవీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జేసీబీ సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, ముఖ్యంగా ఉపాధి పనుల కోసం గుంపులుగా వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎలుగుబంటి సంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి, దాన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.