భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,నలిగిపోతున్న హరీష్ రావు !
తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీలు ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి?. ఒక్క హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నాయి. అయితే అది నేరుగా కాదు. పరోక్షంగా. ఆయనకు నిలువ నీడ లేకుండా చేయాలని అనుకుంటున్నాయి. ఇలా చేయాలని అనుకోవడానికి కారణం ఆయన రాజకీయ భవిష్యత్ ను ధ్వంసం చేయాలనుకోవడమే కాదు.. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించడం, తమ నాయకత్వానికి సమస్య లేకుండా చూసుకోవడానికి ఆయనను టార్గెట్ చేస్తున్నారు. నేతలకు ఇలాంటి పరిస్థితి అరుదుగా వస్తుంది. హరీష్ రావుకు వచ్చింది. అందుకే ఆయన రోజూ శీలపరీక్ష ఎదుర్కొంటున్నారు.
హరీష్‌పై అపనమ్మకం కలిగించాలన్న టార్గెట్ పెట్టుకున్న కవిత
బీఆర్ఎస్ లో హరీష్ రావు ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ఆయనపై అపనమ్మకాన్ని పెంచేందుకు కవిత సస్పెండ్ కావడానికి ముందు నుంచీ ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి .. పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటికీ ఆయనే కారణం అని కవిత ఆరోపిస్తున్నారు. కేటీఆర్ ను నెట్టేసి.. పార్టీని తన గుప్పిట్లోకి తీసుకోవాలని హరీష్ రావు కుట్ర చేస్తున్నారని కవిత నేరుగా ఆరోపిస్తున్నారు. హరీష్ రావు తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారని, పార్టీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. పార్టీని నడిపించే నాయకత్వ లక్షణాలు కేవలం కేటీఆర్‌కే ఉన్నాయని, కానీ హరీష్ రావు తెరవెనుక చక్రం తిప్పుతూ పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చేస్తున్న విమర్శలు పార్టీ క్యాడర్‌లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. వీటికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో హరీష్ రావు పడిపోతున్నారు.
రేవంత్ టార్గెట్ కూడా హరీష్ రావే
సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నారు. ఆయితే రేవంత్ వ్యూహం వేరు. ఆయనను పొగుడుతూ.. అనుమానాలు వచ్చేలా చేస్తున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని వీక్ చేసేందుకు హరీష్ రావు ఏదో కుట్రలు చేస్తున్నారన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు హరీష్ రావును సూటిగా తగులుతున్నాయి. తనపై ఎందుకు సాఫ్ట్ గా ఉంటున్నారో.. ఎందుకు తనపై అనుమానాలు పెరిగేలా మాట్లాడుతున్నారో హరీష్ రావుకు తెలుసు. అలాగని అలాంటి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఉండలేరు. అందుకే స్పందిస్తున్నారు. తన గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా ఉంటాయని చెప్పుకుంటున్నారు.
బీఆర్ఎస్ పట్ల తన నిజాయితీని.. కేసీఆర్ పట్ల తన విధేయతను చూపించుకోవాల్సి వచ్చేలా చేయడమే రేవంత్ తన వ్యూహంలో సక్సెస్ అవుతున్నారని అనుకోవచ్చు.
హరీష్ డామినేట్ చేస్తాడేమోనని కేటీఆర్ కంగారు !
అవునన్నా.. కాదన్నా కేటీఆర్, హరీష్ మధ్య బీఆర్ఎస్ లో కనిపించని పోటీ ఉంటుంది. మొదట హరీష్ రావుదే పార్టీ మొత్తంపై పెత్తనం ఉండేది. తర్వాత వారసుడిగా కేటీఆర్ రేసులో కి వచ్చారు. అయితే హరీష్ రావుతో పోలిస్తే కేటీఆర్ తేలిపోతారని బీఆర్ఎస్ క్యాడర్ చెప్పుకుంటూ ఉంటుంది. ఆయన ట్రబుల్ షూటర్.కేటీఆర్ ఇంకా తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోలేదు. అందుకే రేపు ఏదైనా సంక్షోభం వస్తే హరీష్ రావు సమస్యగా మారుతారని కేటీఆర్ అనుకుంటారు. దీన్ని మరింత పెంచి పెద్దతి చేసేందుకు అందరూ హరీష్ ను టార్గెట్ చేస్తున్నారు.
హరీష్ ను దూరం చేసుకుంటే అందరి ప్రయత్నాలుఫలించినట్లే !

రాజకీయాల్లో అనుమానం పెనుభూతం. హరీష్ రావు విషయంలో కేసీఆర్ అంత సంతృప్తిగా లేరని రెండో సారి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యం చేసినప్పుడే క్లారిటీ వచ్చింది. తర్వాత పదవి ఇచ్చినా ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసే వరకూ ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే హరీష్ రావు తెరవెనుక ఏదో చేస్తున్నారన్న అనుమానాలు కేసీఆర్, కేటీఆర్ లో ఉన్నాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుతూ ఉంటాయి. ఇలాంటి వాటితో అనుమనాలు పెంచుకుని హరీష్ రావును దూరం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ చీలిపోయే ప్రమాదం ఉంది. అది జరగడానికే అందరూ హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ అంతా కూల్ గా ఉండేలా .. బీఆర్ఎస్ చూసుకుంటోంది. కానీ ముందు ముందు ఇలా ఉంటుందా అన్నదే అసలు సమస్య .