భారత్ న్యూస్ డిజిటల్:జోగులాంబ గద్వాల్ జిల్లా:
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయి
క్రీడలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకే కాక ఒక జట్టుగా పనిచేసేందుకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ అన్నారు.
గురువారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్ లో పోలీస్ సిబ్బందికి మూడు రోజులపాటు నిర్వహించిన వార్షిక క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా వివిధ కంపెనీల బెటాలియన్ సిబ్బంది కవాతును కలెక్టర్ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసేందుకు శారీరకంగా దృఢంగా ఉండడం ప్రధానమని పేర్కొన్నారు. ఏటా నిర్వహించే క్రీడల పోటీల సందర్భంగానే కాకుండా ప్రతినిత్యం ఇక్కడ పోలీస్ సిబ్బంది వ్యాయామం చేస్తూ, వివిధ క్రీడల్లో సాధన చేస్తూ ఫిట్ గా ఉండాలని సూచించారు. విజేతలుగా ఎవరు నిలిచినప్పటికీ పోటీల్లో పాల్గొనడం, టీం స్ఫూర్తితో ఆడడం ముఖ్యమని తెలియజేశారు. బెటాలియన్ అతిథిగృహం విస్తరణకు కలెక్టర్ నిధుల నుండి రూ.10 లక్షలు ఇవ్వడం జరిగిందని, భవిష్యత్తులోనూ తన వంతుగా సహకారం అందిస్తానని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, బందోబస్తు సమయంలో బెటాలియన్ పోలీసులు అందజేస్తున్న సేవలు ఎంతో విలువైనవనీ కొనియాడారు. అనంతరం వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన బెటాలియన్ సిబ్బందికి కలెక్టర్ పతకాలు, ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులు కలెక్టర్ కు జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్లు పాణి, నరేందర్ రెడ్డి, ఏవో తాజుద్దీన్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.