.భారత్ న్యూస్ హైదరాబాద్….తాము పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలు… మీ స్పందన తెలియజేయండంటూ బీఆర్ఎస్ కు స్పీకర్ లేఖ
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక మలుపు
తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నామని ఎమ్మెల్యేల వెల్లడి
అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామన్న శాసనసభ్యులు
మూడు రోజుల్లోగా స్పందించాలని బీఆర్ఎస్‌కు స్పీకర్ లేఖ
10 మంది ఎమ్మెల్యేల వివరణపై బీఆర్ఎస్ అభిప్రాయం కోరిన స్పీకర్
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పందన తెలియజేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీని కోరారు. వారి వాదనలపై పార్టీ అభిప్రాయాన్ని మూడు రోజుల్లోగా తెలపాలని సూచిస్తూ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే, కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన సంగతి తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల స్పీకర్‌ను కలిసిన సదరు ఎమ్మెల్యేలు తమపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వకంగా వివరణ సమర్పించారు.
ఆ వివరణలో తాము బీఆర్ఎస్ పార్టీని వీడలేదని, ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు. తాము పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారం చేసేందుకు తమ ఫొటోలను మార్ఫింగ్ చేశారని వారు తమ వివరణలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల నుంచి ఈ అనూహ్యమైన వివరణ రావడంతో, స్పీకర్ కార్యాలయం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. వారు చెప్పిన విషయాలపై బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వారికి లేఖ రాస్తూ, ఎమ్మెల్యేల వివరణపై మీ స్పందన ఏమిటో మూడు రోజుల్లోగా తెలియజేయాలని కోరింది. దీంతో ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులోకి చేరింది. స్పీకర్ లేఖపై ఆ పార్టీ ఏ విధంగా స్పందించనుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.