ఎల్లప్పుడూ నైతికతతో అప్రమత్తంగా ఉండండి” అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం

భారత్ న్యూస్ డిజిటల్: సికింద్రాబాద్ : ,
“ఎల్లప్పుడూ నైతికతతో అప్రమత్తంగా ఉండండి” అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం
దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ విభాగం ఈరోజు అనగా 2025 సెప్టెంబర్ 26న “విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ 2025” కి 3 నెలల ముందస్తు ప్రచారంలో భాగంగా, ఉపన్యాసా కార్యక్రమాన్ని నిర్వహించింది. విజిలెన్స్ బ్రాంచ్ “ఫోర్టిఫై లెక్చర్ సిరీస్” కార్యక్రమంలో భాగంగా ఇది నాలుగవ ఉపన్యాసం.
2025 విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్ కోసం “సెంట్రల్ విజిలెన్స్ కమిషన్” (సి. వి. సి) ఇచ్చిన అంశం “విజిలెన్స్: మన భాగస్వామ్య బాధ్యత” అనే అంశంపై అవగాహన కల్పించడానికి, ఈరోజు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో “ఎల్లప్పుడూ నైతికతతో అప్రమత్తంగా ఉండండి” (“స్టే ఎథికల్లీ విజిలెంట్ ఆల్వేస్ (సేవా)”) అనే అంశంపై ఉపన్యాసం నిర్వహించబడింది.
ఈ అంశం పై ప్రముఖ కార్పొరేట్ కోచ్ మరియు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ శ్రీ హిమాన్షు విష్ణోయ్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాస కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ & చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ చేతనా నంద్ సింగ్, దక్షిణ మధ్య రైల్వే లోని ప్రధాన విభాగాధిపతులు, డివిజనల్ రైల్వే మేనేజర్లు మరియు ఇతర అధికారులు/సిబ్బంది పాల్గొన్నారు.
ఉపన్యాసం సందర్భంగా వ్యక్తిగత మరియు సంస్థాగత విలువలు, నైతికత మరియు సమగ్రత అంశాలపై వివరంగా ప్రస్తావించారు. సంస్థాగత నైతిక అంచనాలను అర్థం చేసుకోవడం, నైతిక ఇబ్బందులు మరియు సందిగ్ధతలను ఎదుర్కోవడం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి అనుసరించాల్సిన సరైనమార్గాలపై చర్చించడం జరిగింది. సంస్థాగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యున్నత సమగ్రత ప్రమాణాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను సవివరమైన ఉదాహరణాలను ఇస్తూ కేస్ స్టడీలతో పాటు చర్చించారు. ప్రజా జీవితంలో అత్యున్నత నైతికత మరియు సమగ్రతను కొనసాగించే అలవాటును పెంపొందించడం ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పరిపాలన యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడంపై నొక్కి చెప్పబడింది.
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్ మాట్లాడుతూ “స్వచ్ఛత హీ సేవ” కార్యక్రమం కింద పరిశుభ్రత ప్రచారం మరియు “విజిలెన్స్ అవగాహన ప్రచారం” మధ్య భావసారూప్యత మరియు ప్రాముఖ్యతను వివరించారు. ఇటువంటి ప్రచారాల లక్ష్యాలను సాధించడానికి వ్యక్తుల ఆలోచన తమ తమ స్వీయ మనస్సుతో స్వీకరించినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఆయన నొక్కి చెప్పారు.