35 కీలక ఔషధాల ధరలు తగ్గించిన కేంద్రం

భారత్ న్యూస్ ఢిల్లీ…..35 కీలక ఔషధాల ధరలు తగ్గించిన కేంద్రం

సామాన్యులకు భారీ ఊరట.. బీపీ, షుగర్ మందులు ఇకపై చౌక

నొప్పి నివారణ, యాంటీబయాటిక్ మందులు కూడా చౌక

కొత్త ధరల జాబితాను దుకాణాల్లో ప్రదర్శించాలని ఆదేశం

అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలని ప్రభుత్వ హెచ్చరిక
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఊరటనిచ్చే నిర్ణయం
సామాన్యులకు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, నొప్పి నివారణ, యాంటీబయాటిక్ వంటి కీలక ఔషధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

ఏయే మందుల ధరలు తగ్గాయి?

ధరలు తగ్గించిన జాబితాలో ప్రముఖ ఫార్మా కంపెనీలు తయారుచేసే అనేక ముఖ్యమైన మందులు ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ మార్కెటింగ్ చేస్తున్న ఏసెక్లోఫెనాక్, పారాసెటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ కాంబినేషన్ టాబ్లెట్ ధరను రూ. 13గా ఎన్‌పీపీఏ నిర్ధారించింది. ఇదే ఫార్ములేషన్‌తో క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ విక్రయించే టాబ్లెట్ ధర రూ. 15.01గా నిర్ణయించారు.

గుండె జబ్బులకు వాడే అటోర్‌వాస్టాటిన్ (40 ఎంజీ), క్లోపిడోగ్రెల్ (75 ఎంజీ) కలిగిన టాబ్లెట్ ధరను రూ. 25.61గా ఖరారు చేశారు. వీటితో పాటు విటమిన్ డి లోపానికి వాడే కోలికాల్సిఫెరాల్ చుక్కల మందు, చిన్న పిల్లలకు ఇచ్చే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్, నొప్పి నివారణకు ఉపయోగించే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ (ఒక మిల్లీలీటర్‌కు రూ. 31.77) వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

నిబంధనలు తప్పనిసరి

కొత్తగా నిర్ణయించిన ధరల జాబితాను రిటైల్ వ్యాపారులు, డీలర్లు తమ దుకాణాల్లో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఎన్‌పీపీఏ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టడంతో పాటు, డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఆర్డర్-2013, నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద చర్యలు తీసుకుంటారు.

ఈ ధరలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనంగా ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఔషధ తయారీ కంపెనీలు తమ కొత్త ధరల పట్టికను ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐపీడీఎంఎస్) ద్వారా జారీ చేసి, ఆ సమాచారాన్ని ఎన్‌పీపీఏకి, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లకు సమర్పించాలని ఆదేశించారు. ఈ తాజా ఉత్తర్వులతో పాత ధరల ఉత్తర్వులు రద్దయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.