భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….CM Revanth Reddy: నాలుగు రోజుల్లోనే నోటిఫికేషన్..
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్ల ముమ్మర కసరత్తు
నేడు సర్కారుకు సీల్డ్ కవర్‌లో అందజేత..
పరిశీలించి జీవో ఇవ్వనున్న ప్రభుత్వం.. ఆ తర్వాత నోటిఫికేషన్!
రిజర్వేషన్లకు 6 రకాల నివేదికలిచ్చిన కమిషన్..
దాని ప్రకారమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు
హైదరాబాద్, సెప్టెంబరు 23 : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందా? నేటి (మంగళవారం) సాయంత్రానికే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయా? అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటికే మొదలైన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మంగళవారం సాయంత్రానికి పూర్తి కానున్నట్లు తెలిసింది. ఆ వివరాలన్నీ ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందనున్నాయి. వాటిని పరిశీలించిన అన ంతరం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు జిల్లాల కలెక్టర్లకు తెలిపాయి. రిజర్వేషన్ల ఖరారు పూర్తయిన తర్వాత.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపేలా సర్కారు ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించి, పంపిన బిల్లులపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, తాజాగా ప్రత్యేక జీవోతో ఎన్నికలకు వెళ్తున్నామని, అందుకు కొంత సమయం కావాలంటూ ప్రభుత్వం హైకోర్టును కోరనున్నట్లు తెలిసింది. మరోవైపు స్థానిక ఎన్నికల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
కమిషన్ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్.. ఇలా 6 ర కాల నివేదికలను కమిషన్ తయారు చేసింది. ఆయా పదవుల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల వివరాలను పేర్కొంది. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లకు ఎంత మేర రిజర్వేషన్ కేటాయించాలి? వార్డుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? ఒకవేళ బీసీలకు సర్పంచ్ పోస్టును ఇవ్వాలంటే గ్రామం మొత్తం మీద బీసీలు ఎందరు ఉన్నారనే అంశాలను పరిగణనలోకి తీసుకుంది. మండల స్థాయి పోస్టులైన ఎంపీటీసీ, ఎంపీపీలకూ ఇదే విధానాన్ని వర్తింపజేయనున్నారు. ఇక జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్‌ల అంశంలోనూ రాష్ట్రస్థాయిలో ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకుంది. దీని ప్రకారమే ప్రస్తుతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు 2024 కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించనున్నారు. అలాగే వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవో; సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లను ఆర్డీవో; ఎంపీపీ, జడ్పీటీసీలకు జిల్లా కలెక్టర్లు; జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లు ఖరారు చేయనున్నారు.
నేడు సీల్డ్ కవర్లో రిజర్వేషన్లు..
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ముమ్మర కసరత్తు జరిగింది. ప్రత్యేక కమిషన్ నివేదికలతో పాటు ఆయా జిల్లాలు, గ్రామాల వారీగా ఉన్న జనాభా వివరాలను ప్రభుత్వం కలెక్టర్లకు అందించింది. ఆ వివరాల ప్రకారమే వార్డు సభ్యుల నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్ వరకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేస్తున్నారు. 12,760 గ్రామపంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 ఎంపీపీలు, 565 జడ్పీటీసీలు, 31 జడ్పీ చైర్‌పర్సన్ స్థానాలకు ఖరారు చేసిన రిజర్వేషన్ల వివరాలను సీల్డ్ కవర్‌లో ఉంచి మంగళవారం సాయంత్రానికి కలెక్టర్లు ప్రభుత్వానికి అందించనున్నారు.
