భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా ….…ప్రగల్భాలు పలకం.. పనిచేసి చూపిస్తాం..
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తో కలిసి లక్ష్మీదేవి పల్లి సందర్శన..
ఇంజనీరింగ్ అధికారులతో స్థల పరిశీలన..
రైతులు సహకరిస్తే త్వరలోనే కల సాకారం అంటున్న ఎమ్మెల్యేలు..
గత ప్రభుత్వంలో ప్రగల్భాలు పాలు పలికేది లేదు.. అనుకున్న లక్ష్యాన్ని వదిలేది లేదు.. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను సాధిస్తాం.. రెండు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తాం.. అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జిల్లేడు చౌదరిగుడా మండలం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కోసం గత ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్ నగర్, పరిగి నియోజకవర్గాలు సముద్రమట్టానికి 570 మీటర్ల ఎత్తున ఉండటం వల్ల రెండు చోట్ల సాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. అందుకే ఈ రిజర్వాయర్ ను సాధించుకోవాలని పరిగి ఎమ్మెల్యే, తాను అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా మాట్లాడమన్నారు. పాలమూరు జిల్లాలో సాగునీటి ఎద్దడిని నివారించాలన్న ఉద్దేశంతో పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇక్కడి రిజర్వాయర్ కు ఉదండాపూర్ ద్వారా, లేదా చేవెళ్ల ప్రాణహిత ద్వారా, అప్పర్ కృష్ణ ద్వారా నీరు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందుకు గతం లోనే అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ప్రాణహితను కాదని కాలేశ్వరం నిర్మించి దానిని కూలేశ్వరంగా మార్చారని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు వారి పాలనకు చెరమగీతం పాడారని అన్నారు. ప్రస్తుతం మూడు అవకాశాల ద్వారా నీటిని పొంది లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ త్రివేణి సంగమంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు సమస్య తీర్చేందుకు సమయం దగ్గర పడిందన్నారు. అంతేకాకుండా పరిగి, షాద్ నగర్ నియోజకవర్గాల మీదుగా ఆర్ఆర్ఆర్ రోడ్డు కూడా త్వరలోనే ప్రారంభం కాన ఉందని అన్నారు. గతంలో ఔటర్ రింగ్ రోడ్డు సమయంలో ఎంతోమంది ధర్నాలు, ఆందోళనలు చేశారని కానీ ప్రస్తుతం హైదరాబాదుకు ఔటర్ రింగ్ రోడ్డు తలమానికంగా మారిందని అన్నారు. కొందరు గత పాలకులు ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. మా పిలుపుమేరకు ఈరోజు టెక్నికల్ సిబ్బంది, ఇంజనీర్లు వచ్చి ఇక్కడి పరిస్థితిని పర్యవేక్షించాలని వెల్లడించారు. రైతులను భూముల కేటాయింపు విషయంలో ప్రత్యర్థులు బెదిరింపులకు గురి చేసే అవకాశం ఉందని, రైతులు అనవసరమైన భయాలు పెట్టుకోవద్దని సూచించారు. అవసరము అయినంత మేరకే భూమి రైతుల నుంచి సేకరించి వారికి పరిహారం కచ్చితంగా అందజేస్తామని వెల్లడించారు. మైసమ్మ సాక్షిగా చెబుతున్నాను నాకు గాని, పరిగి ఎమ్మెల్యేకు గాని ఎటువంటి స్వార్థం లేదు. ఈ రిజర్వాయర్ ను సాధించడం, రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే మా ముందున్న లక్ష్యం అని ఈ సందర్భంగా అన్నారు. ఒక మంచి అడుగు ముందుకు పడిందని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు…
