తత్కాల్‌’ కొత్త రూల్‌: ఆధార్‌ ఓటీపీ ఉంటేనే ట్రైన్‌ టికెట్లు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..తత్కాల్‌’ కొత్త రూల్‌: ఆధార్‌ ఓటీపీ ఉంటేనే ట్రైన్‌ టికెట్లు!

Tatkal ticket rule | దిల్లీ: రైల్వే తత్కాల్‌ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్‌ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌/ యాప్‌లో ఆధార్‌ అథంటికేటెడ్‌ వ్యక్తులకే టికెట్‌ బుకింగ్‌ అవకాశం కల్పించాలని రైల్వే శాఖ తన సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే, జులై 15 నుంచి తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ బేస్డ్‌ ఓటీపీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది.

రైల్వే శాఖకు చెందిన టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు కూడా తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేయాలంటే వ్యక్తుల మొబైల్‌కు వచ్చే ఆధార్‌ ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని తన సర్క్యులర్‌లో పేర్కొంది. అధీకృత ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు ఉదయం 10.30 గంటల తర్వాత, నాన్‌ ఏసీ తరగతులకు ఉదయం 11.30 గంటల తర్వాత మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఐఆర్‌సీటీసీ తమ సిస్టమ్స్‌లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్‌ బుకింగ్‌లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

24 గంటల ముందే వెల్లడి

ట్రైన్‌ బయల్దేరడానికి కంటే నాలుగు గంటల ముందు మాత్రమే ప్రస్తుతం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న టికెట్ల స్టేటస్‌ తెలుస్తోంది. ఇకపై 24 గంటల ముందే ఆ వివరాలు వెల్లడించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బికనేర్‌ డివిజన్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టినట్లు రైల్వే బోర్డుకు చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.