భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..ఇందిరమ్మ మొబైల్ యాప్‌లో కొత్త ఆప్షన్ – ఇకపై లబ్ధిదారుల చేతుల్లోనే ఇళ్ల అప్డేషన్
- బిల్లుల ఆలస్యం, సిబ్బంది చేతివాటానికి పుల్‌స్టాప్
- ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో ఫొటో క్యాప్చర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన హౌసింగ్ శాఖ
పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ప్రారంభ దశ నుంచి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. నిర్మాణానికి అవసరమైన నిధులు లబ్ధిదారులకు సకాలంలో అందకపోవడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఒక కీలక ఆలోచనతో మార్పును తీసుకొచ్చింది. దీని వల్ల లబ్ధిదారులే నేరుగా తమ ఇళ్ల నిర్మాణ దశను మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేయవచ్చు.
లబ్ధిదారులే నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారా అప్లోడ్ :
గతంలో ఇళ్ల నిర్మాణం ముగ్గు, పునాది, గోడలు, శ్లాబ్ వంటి వివిధ దశల్లో ఉన్నప్పుడు అధికారులు కానీ, సిబ్బంది కానీ ఫొటోలు తీసి యాప్‌లో నమోదు చేస్తేనే లబ్ధిదారుల నిర్మాణానికి సంబంధించి నిధులు జమ అయ్యేవి. కానీ ఈ ప్రక్రియలో కొంతమంది అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలకు అడ్డుకట్ట వేయడానికి హౌసింగ్ శాఖ ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో ఫొటో క్యాప్చర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక పై ఈ ఫొటోలను లబ్ధిదారులే నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారా యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఈ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం పూర్తిగా తొలగిపోతుంది. అధికారులు గురువారం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు.
ఇకపై అధికారుల అవసరం లేకుండానే :
దీని వల్ల ఇకపై లబ్ధిదారులు అధికారుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా తమ ఇంటి నిర్మాణాన్ని అనుకూలమైన సమయంలో అప్లోడ్ చేయవచ్చు. దీనివల్ల నిధులు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఎవరి ప్రమేయం లేకుండా నిధులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ అవుతాయి.
ఇంటి వివరాలు అప్లోడ్ ఇలా :
- ఇందిరమ్మ ఇళ్లు యాప్‌లో మీ ఇంటి నిర్మాణ వివరాలను నమోదు చేయడానికి ముందుగా ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి బెనిఫిషియరీ లాగిన్లోకి వెళ్లాలి.
- లాగిన్ అయిన తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, గ్రామం పేరు వంటి వివరాలను నమోదు చేయాలి.
- డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలి.
- ఫొటో క్యాప్చర్ ఆప్షన్ ఎంచుకుని ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో ఆ వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. ఆ దశకు సంబంధించిన ఫొటో తీసి అప్లోడ్ చేయాలి.
- అలాగే ఇంటి నిర్మాణ విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
- ఇంటికి సంబంధించిన జియో కోఆర్డినేట్ చిత్రాలు యాప్‌లో ఉంటాయి. ఆ తర్వాత యాప్‌లో అడిగే ప్రశ్నలకు అవును/కాదు అని సమాధానం చెప్పాలి.
పైన చెప్పిన వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత ఇంటి నిర్మాణ దశ వివరాలు యాప్‌లో అప్లోడ్ అవుతాయి.
ఎవరైనా లబ్ధిదారులు అప్లోడ్ చేసిన వివరాలు, ఫొటోలు సరైనవి కాకపోతే అక్కడి స్థానిక అధికారుల విచారణలో బయటపడుతుంది.
త్వరలో ఈ యాప్ గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించనున్నారు…
