భారత్ న్యూస్ ఖమ్మం….అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి తుమ్మలతో ఎమ్మెల్యే, మున్సిపల్ ప్రజాప్రతినిధుల భేటీ
- తెలంగాణ ముఖద్వారం అశ్వారావుపేట ఆదర్శంగా ఉండాలి : తుమ్మల
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు సోమవారం దమ్మపేట మండలం గండుగులపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బృందంలో మున్సిపల్ వైస్ చైర్మన్, వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు ముఖ్య నాయకులు ఉన్నారు.అశ్వారావుపేట ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండటంతో మన రాష్ట్రానికి ఇది ముఖద్వారం అని ఏపీ వైపు నుండి వచ్చే వారు తెలంగాణలోకి ప్రవేశించగానే అశ్వారావుపేట పట్టణం ఎంతో ఆహ్లాదకరంగా, అందంగా కనిపించేలా సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా అశ్వారావుపేట ముందు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు వార్డుల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ, మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని తమ సమస్యలను మంత్రికి వివరించారు..
