జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?బ‌ట్ట‌బ‌య‌లు చేసిన స‌భ్యులు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….జేఎన్‌జే జర్నలిస్ట్స్ భూములపై కుట్ర‌లా?
నిజాంపేట్‌, పేట్ బ‌షీరాబాద్ లో అక్ర‌మాలు
నిమ్మ‌కాయ‌ల వంశీ శ్రీనివాస్ చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌లు!
కుట్ర‌లు బ‌ట్ట‌బ‌య‌లు చేసిన స‌భ్యులు
స‌హ‌కార శాఖ, ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి-స‌భ్యులు

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 9 : జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్స్ మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో-ఆప‌రేటివ్ హైజింగ్ సోసైటీ సీఈ, కార్య‌ద‌ర్శిగా సుదీర్ఘంగా కొన‌సాగుతున్న‌ నిమ్మ‌కాయ‌ల వంశీ శ్రీనివాస్ చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను స‌భ్యులు హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. 2023 లో వంశీ శ్రీనివాస్‌ పై చార్జిషీటు, ఎన్నికల సంఘం ద్వారా కేసు నిజం కాదా? అని ప్ర‌శ్నించారు. 2022 సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంలో లోగుట్టు ఏమిటి? వెయ్యి కుటుంబాల ప్రయోజనాలను ఫణంగా పెట్టి భూములను జేఎన్‌జేహెచ్‌ఎస్‌ సభ్యులు అనుభవించకుండా ఎందుకు కుట్రపన్నార‌ని నిల‌దీశారు. ప్ర‌భుత్వం సానుకూలంగా ఉన్నా నిజాంపేట, పేట్‌ బషీరాబాద్‌ భూములు జేఎన్‌జేహెచ్‌ఎస్‌ మ్యాక్‌ సొసైటీ సభ్యులకు దక్కనివ్వకుండా కుట్రపన్నుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ గందరగోళంలో నిజాంపేట్, పేట్‌ బషీరాబాద్‌ భూములను అక్రమమార్గంలో కొట్టివేయాలని కుట్రపన్నింది ఎవరు? వారికి బాసటగా నిలిచింది ఎవరు? చొరబాటుదారులకు మార్గం సుగమం చేసింది ఎవరు?
తేల్చాల‌ని ప్ర‌భుత్వాన్ని స‌భ్యులు కోరారు. నిజాంపేట్ లో భోగీ కృష్ణ పేరిట మూడు ఎక‌రాలు, స్ట్రింగ‌ర్స్ పేరిట రెండు ఎక‌రాలు అక్ర‌మ‌ణ‌లు జ‌రిగాయ‌ని ఆరోపించారు. పేట్ బ‌షీరాబాద్ లో క‌బ్జాలు, మానేటి శ్రీనివాస్ రెండు వేల‌ గ‌జాలు ఆక్ర‌మించి రెండంత‌స్టుల ఇళ్లు, అప‌ర్ణ వెంచ‌ర్స్‌కు సోసైటీ భూమిలోంచి రోడ్డు, సెయింట్ ఆన్స్ పాఠ‌శాల ఎక‌రంన్న‌ర క‌బ్జా అంశాల్లో నిమ్మ‌కాయ‌ల వంశీ పాత్ర అనుమానాస్పందంగా ఉంద‌న్నారు.

ప్రభుత్వ ఖజానాకు చెల్లించగా అలాట్‌ అయిన భూమి అన్యాక్రాంతమైతే ఎందుకు మీ మీడియాహౌజ్‌ల ద్వారా ఆ కబ్జాలను వెల్లడించలేదని, సాటి జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదని వాపోయారు. జర్నలిస్టు సంఘాలు కూడా ఈ విషయంలో నోరు మెదపడం లేదెందుకు? ఈ దోస్తీ ఏమిటి? చార్జీషీటు తర్వాత విచారణ ఏమైంది? కంప్లయింట్‌ దారులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ లోపాయికారీ ఒప్పందాలే త‌మ‌కు శాపంగా మారాయ‌న్నారు.

చార్జ్‌ షీట్‌ నమోదై ఉన్న వ్యక్తికి ఓట్లేయమని ప‌లు మీడియాల్లో కీల‌క స్థానాల్లో ఉన్న‌వారు ఎలా మెసేజ్‌ విడుదల చేశారు? అలా మెసేజ్‌ విడుదల చేసినందుకు గాను సొసైటీకి, సభ్యులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తారా?
లేదా మీ పేర్ల‌ను మీ అనుమ‌తి లేకుండా వంశీ శ్రీనివాస్ వాడుకున్నారా స్ప‌ష్టం చేయాల‌ని స‌భ్యులు డిమాండ్ చేశారు.

స‌హ‌కార శాఖ చ‌ర్య‌లు తీసుకోవాలి

2014 నుంచి 2021 వ‌ర‌కు JNJHS సోసైటీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌కున్నా, జ‌రిగిన‌ట్లుగా క‌మిటీ వ్య‌వ‌హ‌రిస్తే స‌హ‌కార శాఖ అధికారులు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని స‌భ్యులు ప్ర‌శ్నించారు. ప్రతి సంవత్సరం ఆడిట్‌ రిపోర్టులు , సభ్యుల వివరాలు ఎవరు పొందుపరిచారు? ఈ గందరగోళానికి కారణం అప్పటి ప్రభుత్వం, సంబంధిత ప్రభుత్వ శాఖలది కాదా? అన్నారు.

సుప్రీం కోర్టుకు ఎందుకు?

ఇళ్లులేని సోసైటీ స‌భ్యులు అఫిడ‌విట్లు ఇచ్చి భూములు తీసుకోవాల‌ని 2010లో హైకోర్టు స్ప‌ష్టంగా పేర్కొన్నా, స‌భ్యుల‌ను సంప్ర‌దించ‌కుండా సుప్రీంకోర్టుకు వెళ్లార‌ని స‌భ్యులు వాపోయారు. గవర్నమెంట్‌ మెమో నంబరు 19544 /ఏఎస్‌ఎస్‌ఎన్‌ 5(3) – 2011, 04–01–2012 ద్వారా త‌మ‌ సొసైటీ ప్రభుత్వానికి డబ్బులు కట్టింద‌న్నారు. ప్రభుత్వం ఐ అండ్‌ పీఆర్‌ శాఖ ద్వారా భూములను త‌మ‌ సొసైటీకి స్వాధీన పరిచినా కూడా ఎందుకు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ విరమించుకోలేదు? దీని వెనుక ఉన్న మ‌ర్మ‌మేమిటో నిమ్మ‌కాయల వంశీ చెప్పాల‌న్నారు.

సీఎం రేవంత్ కు కృత‌జ్ఞ‌త‌లు

ఈ మొత్తం యవనికలో జేఎన్‌జేహెచ్‌ఎస్‌ సభ్యులను కాపాడుతున్న అంశం ఒకే ఒక్కటి. అది రాష్ట్ర ముఖ్యమంత్రి 2024, సెప్టెంబర్, ఎనిమిదవ తేదీన రవీంద్రభారతిలో భారీ సభ ఏర్పాటు చేసి పేట్ బ‌షీరాబాద్‌ భూముల మీద అనుభవ హక్కులను ప్రసాదిస్తూ అధికారిక పత్రాన్ని విడుదల చేశారని స‌భ్యులు తెలిపారు. త‌మ‌కు అండగా నిలిచిన కాంగ్రెస్‌ సర్కారుకు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మీడియా అకాడమీ ఛైర్మ‌న్‌ కే. శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పారు.