భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..ఆధార్ మాదిరిగా భూములకు ‘భూధార్’… ప్రతి కమతానికీ ప్రత్యేక సంఖ్య
ప్రతి కమతానికీ ప్రత్యేక సంఖ్య.భూముల సమగ్ర వివరాలు అందుబాటులోకి
రిజిస్ట్రేషన్-మ్యుటేషన్కు సర్వే తప్పనిసరి చేస్తూ భూభారతి చట్టంలో సెక్షన్లు ఏర్పాటు

📍ఒక వ్యక్తి ఆధార్ నంబర్తో వారి వయసు, చిరునామా, సిమ్‌కార్డులు, ఆదాయ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అదే విధంగా సర్వే, ఉప సర్వే నంబర్లు, మ్యాప్, సరిహద్దులు, బీమా, నేల రకం, విస్తీర్ణం, ఎలా సంక్రమించింది, లింక్ డాక్యుమెంట్లు, బ్యాంకు రుణాలు, మార్టిగేజ్ తదితర మొదలైన భూమి గురించి సమగ్ర సమాచారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ‘భూధార్’ను అమలు చేయనుంది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెవెన్యూ శాఖను ఇటీవల ఆదేశించారు.
ఈ భూధార్ అమలులోకి వస్తే భూ ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టికి అడ్డుకట్ట పడనుందని ప్రభుత్వం భావిస్తోంది. భూధార్ జారీ చేయాలంటే ప్రతి భూమిని సర్వే చేయాల్సి ఉంటుంది. భూమి సరిహద్దులను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి భూధార్‌లో నమోదు చేస్తారు. దీన్ని రెండు పద్ధతుల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తికాక ముందు తాత్కాలిక, పూర్తయ్యాక శాశ్వత భూధార్ అని రెండు భూధార్లు జారీ చేయనుంది.
ప్రతి రిజిస్ట్రేషన్-మ్యుటేషన్కు సర్వే తప్పనిసరి చేస్తూ భూ చట్టంలో సెక్షన్లు చేశారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి కనీసం 43 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లను ప్రభుత్వం నియమిస్తోంది. ప్రస్తుతం 7,000 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల సర్వే నిర్వహించిన రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన పైలట్ గ్రామాల్లో మొదట భూధార్ కార్డులు జారీ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
నంబరు నమోదు చేస్తే చాలు :
- రాష్ట్రంలో 70.59 లక్షల మంది రైతులు ఉండగా, 1.40 కోట్ల ఎకరాల సాగు భూములున్నాయి. భూ దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం (ఆర్వోఆర్) కింద ప్రతి కమతానికి పట్టా పాసుబుక్ జారీ చేస్తుండగా, అందులో పలు సర్వే నంబర్ల కింద ఉన్న భూమి వివరాలు తప్ప ఏమీ ఉండటం లేదు.
- భూధార్‌తో ఒక రైతుకు చెందిన భూమి సమగ్ర వివరాలు అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇందులో భాగంగా కమతాలన్నింటినీ కంప్యూటరీకరించడం, ప్రభుత్వం వద్ద భూమికి సంబంధించిన పథకాలన్నింటినీ జోడించే ప్రక్రియలను చేపట్టనున్నారు.
- అనంతరం ఆర్వోఆర్ 2025 భూభారతి చట్టంలోని సెక్షన్ 9(రూల్ 9) ప్రకారం రాష్ట్రంలోని ప్రతి భూమి ప్లాట్కు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో ఈ నంబర్ను నమోదు చేయడం ద్వారా భూమి సమగ్ర వివరాలు తక్షణమే తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికోసం రెవెన్యూశాఖ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది.
- డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునికీకరణ పథకంలో భాగంగా ప్రతి కమతానికి యూఎల్‌పిన్/భూ ఆధార్/భూధార్ జారీ చేయాలని కేంద్రం సూచిస్తోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే తాత్కాలిక లేదా శాశ్వత భూధార్ కార్డుల జారీ ప్రారంభించాయి.
ప్రతి భూదస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురావాలన్నదే ‘భూధార్’ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. అయితే తాత్కాలిక, శాశ్వత అనే రెండు పద్ధతులను అనుసరిస్తోంది. ప్రతి పౌరుడికీ ‘ఆధార్’ కేటాయించినట్లే దేశంలోని ప్రతి కమతానికీ ఒక విశిష్ఠ నంబర్ను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే భూధార్. దీనివల్ల ఆస్తులకు రికార్డు ఉంటుంది….