కోమటిరెడ్డి, రేవంత్ మధ్య ఏం జరుగుతోంది!?

…భారత్ న్యూస్ హైదరాబాద్….కోమటిరెడ్డి, రేవంత్ మధ్య ఏం జరుగుతోంది!?

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మళ్లీ కోల్డ్ వార్ మొదలైందా.. అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి కూడా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమానికి ఆయన గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం నిర్వహించే సినీ సంబంధిత కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాలి. కానీ, గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం వంటి భారీ కార్యక్రమంలో ఆయన కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో జరిగిన సినీ కార్మికుల సభకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. తన శాఖకు సంబంధించిన ప్రధాన ఘట్టాల్లో మంత్రి పాల్గొనకపోవడం వెనుక కేవలం బిజీ షెడ్యూల్ ఉందా లేక ఉద్దేశపూర్వక దూరమా అనే సందేహాలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

టిక్కెట్ల రేట్ల విషయంలోనూ ఆయన అసంతృప్తికి గురయ్యారు. తనకేం తెలియదని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పీసీసీ చీఫ్ విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. చివరికి హైకమాండ్ నుంచి హెచ్చరికలు రావడంతో వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య గతంలో ఉన్న విభేదాలు తగ్గాయని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈ తాజా పరిణామాలు కాంగ్రెస్‌లో కలవరం పుట్టిస్తున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో గానీ, అధికారుల నియామకాల్లో గానీ తన జిల్లా లో తనకు తెలియకుండా నిర్ణయాలు జరుగుతున్నాయని కోమటిరెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే అసలు కారణాలు అంతర్గతంగా ఏవో ఉండి ఉంటాయని.. మంత్రి వర్గ విస్తరణ ప్రచారం సమయంలో.. ఆయనను తప్పించి.. ఆయన సోదరుడికి స్థానం కల్పిస్తారన్న ప్రచారంతో వెంకటరెడ్డి మనస్థాపానికి గురయ్యారని కూడా అంటున్నారు. ముందు ముందు జరిగే పరిణామాలతో ఈ అంశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.