కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు.

ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు..

పనులు పరుగులు పెడతాయని సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ సాక్షిగా తేలిపోయింది. “సారు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు” అని విమర్శించే ప్రత్యర్థులకు, “ఆయన ఎక్కడున్నా శాసించగలరు” అని కేసీఆర్ తన స్టైల్‌లో సమాధానమిచ్చారు.

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, క్షీరసాగర్ వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు నీరు లేక కళ్లముందే ఎండిపోతున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి, ఆలేరు కాలువలకు నీటిని వదులుతున్నా.. తమ గ్రామాల కాలువలకు మాత్రం నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన రైతులు డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డిని ఆశ్రయించారు.

సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఎర్రవల్లి’ బాస్!

రైతుల కష్టాన్ని విన్న అంజిరెడ్డి నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను కలిశారు. ఎండిపోతున్న పంటల ఫోటోలను చూసిన కేసీఆర్, క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. “రైతు కంట కన్నీరు రాకూడదు.. పంటలు ఎండిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వెంటనే నీటిని విడుదల చేయండి” అంటూ తనదైన శైలిలో సూచించారు.

హుటాహుటిన పరుగులు పెట్టిన యంత్రాంగం!

ఆశ్చర్యకరంగా.. కేసీఆర్ ఫోన్ చేసిన కాసేపటికే అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. అప్పటివరకు సవాలక్ష కారణాలు చెప్పిన అధికారులు, మాజీ సీఎం ఆదేశాలతో వెంటనే అలర్ట్ అయ్యారు. హుటాహుటిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు. కాలువల్లో నీరు ఉరకలెత్తుతుంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.

సోషల్ మీడియాలో వైరల్:

ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో లేకపోయినా కేసీఆర్ ఒక ఫోన్ కాల్‌తో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “సీఎం సీటులో ఉన్నా లేకున్నా.. కేసీఆర్ క్రేజ్ వేరు” అంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఫామ్ హౌస్ నుంచే పాలనను శాసించగల సత్తా ఆయనకు ఉందని ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. తమ పంటలను కాపాడిన కేసీఆర్‌కు ఆయా గ్రామాల రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.