సిరీస్ భారత్ కైవసం,

భారత్ న్యూస్ మంగళగిరి…సిరీస్ భారత్ కైవసం

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అంటే మాటలు కాదు. కానీ టీ20ల్లో ఆ జట్టుపై టీమిండియాకు గొప్ప రికార్డే ఉంది. గత 17 ఏళ్లలో టీమిండియా ఆస్ట్రేలియాలో ఒక్కసారి కూడా సిరీస్ కోల్పోలేదు. అదే రికార్డును కొనసాగిస్తూ.. తాజాగా టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. స్ఫూర్తిదాయక ఆటతో ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా సిరీస్ సొంతం చేసుకుంది. తొలి, ఆఖరి మ్యాచ్‌లు వర్షార్పణం కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో రెండు మ్యాచ్‌లు భారత్ గెలిచింది.

ఆఖరి మ్యాచ్ రద్దు..

బ్రిస్బేన్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా జట్లు ఐదో టీ20లో పొటీ పడ్డాయి. తొలుత ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆట ఆగే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(23), శుభ్‌మన్ గిల్(29) ఆడినంత సేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బౌండరీలు బాదుతూ ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఐదు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంతలోనే పిడుగుల కూడిన వర్షం పడే అవకాశం ఉందని మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. వర్షం తగ్గే సూచన లేకపోవడంతో ఆఖరి మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

టాస్‌లు ఓడినా..

టీమిండియా ఈ ఆసీస్ టూర్‌లో 8 టాస్‌ల్లో ఏడు సార్లు టాస్ ఓడింది. వన్డేల్లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా మూడు మ్యాచుల్లో టాస్‌లు ఓడిపోయింది. ఐదు టీ20ల్లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే(మూడో టీ20) టాస్ గెలిచాడు. భారత జట్టు గత 12 నెలలుగా ఎక్కువ శాతం టాస్ ఓడిపోతూనే వస్తోంది..