భారత్ న్యూస్ ఢిల్లీ…..సోషల్ మీడియాలో స్టార్.. నేరాల్లో కిలాడీ: దుబాయ్లో గ్యాంగ్స్టర్ ఇందర్జీత్ అరెస్ట్!
భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఇందర్జీత్ అనే గ్యాంగ్ స్టర్ దుబాయ్ లో ఉంటూ సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లతో సెలబ్రిటీగా చెలామణీ అవుతున్నాడు. హర్యానా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తన గ్యాంగ్ తో కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత నిఘా సంస్థలు అందించిన పక్కా సమాచారంతో దుబాయ్ పోలీసులు ఈ గ్యాంగ్ స్టర్ ను తాజాగా అరెస్టు చేశారు.
ఇందర్జీత్పై భారత్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, భూకబ్జాలు వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి 30కి పైగా కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చిక్కకుండా విదేశాల్లో తలదాచుకుంటున్న ఇతడిపై భారత ప్రభుత్వం గతంలోనే ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఒకవైపు నేర సామ్రాజ్యాన్ని నడుపుతూ, మరోవైపు ఇన్స్టాగ్రామ్లో విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శించేవాడు. ఖరీదైన కార్లు, డిజైనర్ దుస్తులతో వీడియోలు పోస్ట్ చేస్తూ దాదాపు 15 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. గల్ఫ్ దేశాల్లోని వ్యాపారవేత్తలను, భారత్లోని బిల్డర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

ప్రస్తుతం ఇతడిని భారత్కు అప్పగించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. న్యాయపరమైన లాంఛనాలు పూర్తయిన వెంటనే అతడిని ఢిల్లీకి తరలించి విచారించనున్నారు. ఇందర్జీత్ అరెస్టుతో ఉత్తర భారతంలోని పలు నేర ముఠాల నెట్వర్క్కు గట్టి దెబ్బ తగిలినట్లయిందని పోలీసులు భావిస్తున్నారు.