.భారత్ న్యూస్ హైదరాబాద్….MAHAA News ఛానెల్ ని సందర్శించిన టీయుడబ్ల్యూజే,ఐజేయు నేతలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఓ కథనాన్ని ప్రసారం చేసిన మహా న్యూస్ ఛానెల్ పై ఇవ్వాళ బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు దాడి జరిపి, విధ్వంసం సృష్టించిన సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) తీవ్రంగా స్పందించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణలు జూబ్లీహిల్స్ లోని మహా న్యూస్ ఛానెల్ కార్యాలయాన్ని సందర్శించి విధ్వంసం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా సిబ్బందిని వారు పలకరించి సంఘటన పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు. ఛానెల్ సిఎండి వంశీని కలిసి మనోధైర్యాన్ని అందించారు. అనంతరం విరాహత్ అలీ మీడియాతో మాట్లాడుతూ, హింసకు దూరంగా, శాంతియుత పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు దురదృష్టకరమన్నారు. మీడియా సంస్థపై ఇనుప రాడ్లు, కర్రలు, బండ రాళ్లతో హింసాత్మకంగా ఇలాంటి దాడులు జరపడం ఇది ప్రథమం అన్నారు. తెలంగాణ రాష్ట్రం మానవ హక్కుల పరిరక్షణలో, భావ ప్రకటన స్వేచ్ఛకు దేశంలో ఆదర్శంగా ఉండేలా చూడాలి కానీ, ఇలాంటి పాశవిక దాడులతో కాదని ఆయన తెలిపారు. ఈ సంఘటనను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని, పోలీసులు సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
