.భారత్ న్యూస్ హైదరాబాద్….ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈసారి పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు కేరళం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్.. చివరిరోజున అక్కడి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాగా.. తొలిసారిగా పెదవి విప్పారు. ‘ఇక్కడి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపడుతాం. ఈసారి పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తాం’ అని వివరించినట్లు కేరళం మీడియా ప్రతినిధులు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నామనే అంశంపై సీఎం అక్కడి మీడియాకు పూర్తిస్థాయిలో తెలియజేశారు. రైతు రుణమాఫీ వల్ల ఎంత మంది రైతులకు ప్రయోజనం కలిగిందో వివరించారు. ప్రతిఏటా రైతు భరోసా స్కీమ్ కోసం ప్రభుత్వం రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటివరకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పథకాల వల్ల ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్యను లెక్కలతో సహా వెల్లడించారు.
ఎన్నికల బిజీలో ఐసీసీ నేతలు
ప్రస్తుతం ఏఐసీసీ నేతలు పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈనెల 9న కేరళం, పాండిచ్చెరి, అస్సాంలో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోలింగ్‌పై ఫోకస్ పెట్టనున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంలోని పెద్దలకు కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు సమయం దొరకడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత.. రాష్ట్రానికి చెందిన కీలక నేతలను ఢిల్లీకి పిలిపించి.. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాపై ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని, కొత్తగా కేబినెట్లోకి తీసుకునే నేతల ఎంపికపై చర్చించనున్నట్లు తెలిసింది. ఆ మీటింగ్‌లోనే శాఖల మార్పు అంశంపై సీఎం రేవంత్ తన ప్రపోజల్స్‌ను అధిష్టానం ముందు పెడుతారనే ప్రచారం జరుగుతున్నది.
ఊహాగానాలకు తెర..

కేబినెట్ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ, అసెంబ్లీ సమావేశాల సమయంలో విస్తరణ అంశాన్ని సీఎం రేవంత్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తవించిన సమయంలో ‘కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాం’ అంటూ వెల్లడించారు. కేరళంలో మాత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పడంతో ఇంతకాలం వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అదే రాష్టానికి చెందిన ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ప్రచారం బిజీగా ఉండటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి తర్వాత విస్తరణ అంశంపై చర్చించి, ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏండ్లు అవుతుంది. ఇప్పటికీ మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయి. వాటిని ఇంకా భర్తీ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు. పైగా ఇంటా, బయట విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడే విస్తరణ, ప్రక్షాళన చేయడం మంచిదనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. కాగా, కేవలం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తారా? కొందరిని తప్పించి ఆ స్థానాల్లో కొత్త వాళ్లను కేబినెట్లోకి తీసుకుంటారా? అనేది హైకమాండ్‌తో సంప్రదింపుల తర్వాత క్లారిటీ రానుంది. పనితీరు సరిగా లేని మంత్రులను తప్పించి, అదే సామాజిక వర్గాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రుల శాఖలను తప్పించి, అంతగా ప్రయారిటీ లేని శాఖల బాధ్యతలు ఇవ్వాలని కొందరు ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది….