భారత్ న్యూస్ ఢిల్లీ…..Bhatti Vikramarka : వరద నష్టం నివేదికతో కేంద్ర సహాయం కోరిన తెలంగాణ మంత్రులు..!!
Bhatti Vikramarka : తాజా భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు.
మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమైన భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ అంశాలపై చర్చించారు. అంతేకాదు, తెలంగాణలో విస్తారంగా పండించే పామాయిల్‌పై విధిస్తున్న సుంకాలను తగ్గించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలన్న విజ్ఞప్తులను కూడా నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కూడా కలవబోతున్నాం. రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన భారీ నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి, కేంద్రం నుంచి సహకారం కోరతాం” అని తెలిపారు. ఇక వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణలో వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైందని, దాంతో రహదారులు, పంటలు, ఆస్తులకు విపరీత నష్టం జరిగిందని పేర్కొన్నారు. “మొన్న ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు. ఇవాళ ప్రత్యక్షంగా పర్యటిస్తున్నారు. ప్రాథమిక నివేదికను సాయంత్రం హోం మంత్రి అమిత్ షాకు అందజేస్తాం. త్వరలో పూర్తి నివేదికను కూడా సమర్పిస్తాం” అని తెలిపారు.
అలాగే, గతంలోనూ వరదల సమయంలో కేంద్ర బృందాలు వచ్చి పర్యటించినప్పటికీ, ప్రత్యేకంగా ఎలాంటి వరద సాయం రాష్ట్రానికి అందలేదని విమర్శించారు. “బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక గ్రాంట్లు ఇస్తోంది. అదే విధంగా తెలంగాణకు కూడా ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి. వరదల కారణంగా ఇప్పటివరకు జరిగిన నష్టం సుమారు రూ.5 వేల కోట్లు. ఈ ప్రాథమిక నివేదికను హోం మంత్రి అమిత్ షా కి అందజేస్తాం” అని తుమ్మల స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రుల ఈ ఢిల్లీ పర్యటనపై అన్ని వర్గాల దృష్టి సారించింది. వరద నష్టంపై కేంద్రం స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.
