భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు భారీ డిమాండ్.. తొలిరోజే 1.4 లక్షల మంది కొనుగోలు
జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. తొలిరోజే సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల టోల్ ప్లాజాల్లో ఆగస్టు 15న ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు సుమారు 1.4 లక్షల వాహనదారులు ఈ పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. 1.39 లక్షలకుపైగా లావాదేవీలు నమోదయ్యాయి. అదే సమయంలో రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో ఏకకాలంలో 20 నుంచి 25 వేల మంది వినియోగదార్లు లాగిన్ అవుతున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తెలిపింది.

రూ.3 వేలతో ఫాస్టాగ్ టోల్‌పాస్ తీసుకునే కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు(ఏది ముందైతే అది) జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. ఇది వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ రూ.3 వేలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్‌తోనే టోల్‌పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI, morth వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఈ వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.