హాజీపూర్‌‌లో నకిలీ నోట్ల కలకలం..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….హాజీపూర్‌‌లో నకిలీ నోట్ల కలకలం..

ఆ బ్యాంకు పేరుతో నోట్లు..

📍మంచిర్యాల: హాజీపూర్‌ మండలం గుడిపేటలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గుడిపేటలో నోట్ల మార్పిడికి పాల్పడ్డారు. దుండగులు నోట్ల మార్పిడి చేస్తున్న సమయంలో వారిపై అనుమానం వచ్చిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గుడిపేటలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో నోట్ల మార్పిడి చేస్తుండగా.. ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని పట్టుకుని, నిందితుల నుంచి నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నోట్లు చిల్డ్రన్ బ్యాంకు పేరుతో ముద్రించినట్టు గుర్తించామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు