భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….హైదరాబాద్: ఎట్టకేలకు శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి టెండర్లు షురూ కానున్నాయి. ఈ నెల 29న నోటిఫికేషన్ జారీకి హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ వరకు చేపడుతున్న కారిడార్‌కు సంబంధించి కీలకమైన రక్షణశాఖ భూముల అప్పగింత ఒక కొలిక్కి వచ్చింది. టెండర్ల అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి. ప్యారడైజ్ నుంచి రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో డైయిరీఫాం కారిడార్ పనులకు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఈ రెండు ప్రాజెక్టులతో ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే వాహనదారులకు పెద్ద ఊరట. మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వైపు రాకపోకల్లో ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
