భారత్ న్యూస్ ఖమ్మం…..మత్తు పదార్థాలతో యువత జీవితం అంధకారం.
డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మత్తు పదార్థాలతో యువత జీవితం అంధకారం అవుతుందని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఆదివారం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తు పదార్థాల నియంత్రణ బలోపేత దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గద్వాల కృష్ణవేణి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు ముఖ్య అతిథులు, వైద్యాధికారులు, విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో మత్తు ప్రభావితుల చికిత్స విభాగం, అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ను గద్వాల పురపాలక చైర్మన్ తుమ్మల జయలక్ష్మి, అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిఎస్పీ మొగులయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కేంద్రంలో మత్తు పదార్థాలకు బానిసైన వారికి మానసిక వైద్య నిపుణుల ద్వారా చికిత్స, కౌన్సిలింగ్ మరియు ఉచిత మందులు అందించబడతాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు తీవ్రమైన ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు తీసుకుని డ్రైవింగ్ చేయడం వలన జరిగే యాక్సిడెంట్లలో చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని, ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా చదువుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. యోగ, ధ్యానం, వ్యాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో వచ్చే ఒత్తిడిని సరైన ప్రణాళికతో అధిగమించవచ్చని తాత్కాలిక ఉపశమనం కోసం మత్తు పదార్థాలవైపు మళ్లడం భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. యువత ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకొని, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని ప్రేరణాత్మకంగా పిలుపునిచ్చారు. డీఎస్పీ మొగిలయ్య మాట్లాడుతూ
రాష్ట్రంలో మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ దిశగా ఈగల్ టీమ్ నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసై ఉంటే లేదా డ్రగ్స్ పంపిణీ జరుగుతున్నట్లు తెలిసినా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు సమాచారం అందించాలని సూచించారు.
అనంతరం మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులకి నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ హేమలత, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వెంకట దాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సంధ్య కిరణ్మయి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వైస్ డాక్టర్ నాగేశ్వరరావు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్లు శ్రీనివాసులు, మధు, వైద్య, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
………………………………………………
జారీ చేయువారు: డీపీఆర్ఓ/జోగులాంబ గద్వాల జిల్లా.