మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు..నేనేంటో అంద‌రికీ తెలుసు, 70 కోట్ల కాంట్రాక్ట్ వ‌ర్క్‌కు తాప‌త్ర‌య‌ప‌డే అవ‌స‌రం నాకు లేదు”

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు..

నేనేంటో అంద‌రికీ తెలుసు, 70 కోట్ల కాంట్రాక్ట్ వ‌ర్క్‌కు తాప‌త్ర‌య‌ప‌డే అవ‌స‌రం నాకు లేదు”
•••••••
రూ.251 కోట్ల‌తో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్ది
ఈసారి కోటిమందికి పైగా భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా
నాపై ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు- ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌డం లేదు
నేనేంటో అంద‌రికీ తెలుసు
వ‌రంగ‌ల్ ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌మంత్రి, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

మేడారం / హైద‌రాబాద్ :- అశేష భ‌క్తుల కొంగుబంగారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్దికి ప్ర‌భుత్వం 251 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌మంత్రి, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. సోమ‌వారం ఆయ‌న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌తో క‌లిసి ములుగు జిల్లా మేడారంలోని స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌య అభివృద్ది ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. అధికారుల‌తో క‌లిసి ఆల‌య ప‌నుల ప్రగ‌తిని స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవ‌ల గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా 101 కోట్ల రూపాయిలు మంజూరు చేయ‌గా వీటిలో 71 కోట్ల రూపాయిల‌కు టెండ‌ర్లు పిలవ‌డం జ‌రిగింద‌న్నారు. గ‌తంలో మంజూరైన 150 కోట్ల రూపాయిల‌తో క‌లిపి ద‌శ‌ల‌వారీగా శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఆల‌యాభివృద్ది చేసేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.
మేడారం జాత‌ర‌కు వ‌చ్చే నిధులు జంప‌న్న వాగులో వ‌ర‌ద‌లాగ జారిపోకుండా గిరిజ‌న‌, గిరిజ‌నేత‌రుల ఆరాధ్య‌దైవాల ప్రాంగ‌ణాల‌ను అభివృద్ది చేస్తామ‌ని, దీనిలో భాగంగా రోడ్లు ఇత‌ర నిర్మాణాలు సాగిస్తామ‌ని చెప్పారు. మ‌రో 50 రోజుల్లో ఈ ప‌నుల‌కు ఎటువంటి ఆటంకం లేకుండా ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో సాగేలా క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌కు సూచ‌న‌లు ఇచ్చామ‌న్నారు. ఆల‌యాభివృద్దికి ఎవ‌రు ఎటువంటి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చినా స్వీక‌రిస్తామ‌ని, ఈ ప‌నుల‌ను మంత్రి సీత‌క్క స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తార‌ని అన్నారు.
గ‌తంలో ఈ జాత‌ర‌కు కోటి మందికి పైగా వ‌చ్చినట్లు అధికారులు చెప్పార‌ని ఈ సారి ప్ర‌భుత్వ అభివృద్ది చ‌ర్య‌ల కార‌ణంగా ఈ సంఖ్య రెట్టింపు అవుతుంద‌న్నారు. మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స్పందిస్తూ “నేనేంటో అంద‌రికీ తెలుసు, 70 కోట్ల కాంట్రాక్ట్ వ‌ర్క్‌కు తాప‌త్ర‌య‌ప‌డే అవ‌స‌రం నాకు లేదు. నాపై స‌హ‌చ‌ర మంత్రులు ఫిర్యాదు చేశారంటే న‌మ్మ‌డం లేదు. ఫిర్యాదు చేయ‌డానికి ఏమంది అధిష్టానానికి ఎవ‌రూ ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు. నేను కూడా అలా జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌డం లేదు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి ఆలోచ‌న‌ల మేర‌కు అభివృద్ది ప‌నులు చేస్తున్నాం. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల వంటి సీత‌క్క‌, సురేఖ అక్క‌ల‌తో ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతాను”అని మంత్రి పొంగులేటి చెప్పారు. స‌మావేశంలో ఎంపీ బ‌ల‌రాం నాయిక్ తదిత‌రులు పాల్గొన్నారు….