భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,Weather Update: చలి తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు…
Weather Update: బంగాళాఖాతం నుండి వీస్తున్న తేమతో కూడిన తూర్పు గాలుల వల్ల ఏపీలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
అయితే, దక్షిణ కోస్తాలో నెలకొన్న తేమ పరిస్థితుల కారణంగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో నేడు, రేపు సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఉక్కపోత కొనసాగినా, రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల చలి తీవ్రత అంతగా ఉండదు.
తెలంగాణలో కమ్మేస్తున్న పొగమంచు
తెలంగాణలో రాబోయే మరో మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుంది. పశ్చిమ విక్షోభం ప్రభావం ఉత్తర భారతదేశంపై ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండవచ్చు. హైదరాబాద్, పరిసర జిల్లాల్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 29°C నుండి 30°C వరకు, రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 17°C ఆవరణలో నమోదవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు తగ్గుముఖం పట్టినప్పటికీ, తెల్లవారుజామున పొగమంచు మాత్రం 10 అయిన రోడ్లు కనిపించడం లేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విశాఖపట్నం: పగలు వేడి.. రాత్రి ఆహ్లాదం
వైజాగ్ నగరంలో రాబోయే మూడు రోజులు మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. పగటిపూట సముద్రపు తేమ కారణంగా వేడి, ఉక్కపోత (Sultry weather) ఎక్కువగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 27°C నుండి 28°C మధ్య ఉండవచ్చు. అయితే, సాయంత్రం తర్వాత పరిస్థితి మారుతుంది. రాత్రి సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, చల్లని గాలులతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. పర్యాటకులు బీచ్‌లలో గడపడానికి రాత్రి సమయం అనువుగా ఉంటుంది.
మన్యంలో చలి పంజా
పర్యాటక ప్రాంతాలైన అరకు లోయ, వంజంగి, చింతపల్లి, లంబసింగిలో చలి తీవ్రత గరిష్టంగా ఉంటుంది. ఈ వారాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడం వల్ల ‘జీరో విజిబిలిటీ’ (దృష్టి లోపం) ఏర్పడవచ్చు. ప్రకృతి ప్రేమికులకు, మంచు అందాలను ఆస్వాదించే పర్యాటకులకు ఇది సరైన సమయం అయినప్పటికీ, వాహనదారులు పొగమంచు విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

అలాగే రైతులు అకాల వర్షాల పట్ల జాగ్రత్త వహించి కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు భారీ చలిని తట్టుకోవడానికి అవసరమైన ఉన్ని వస్త్రాలను వెంట తీసుకెళ్లడం మంచిది. అలాగే వెళ్లిన తర్వాత వేడి వేడి పానీయాలు, వేడి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా విశాఖ, తిరుపతి పరిసరాల్లో ప్రయాణించే వారు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి.