..భారత్ న్యూస్ హైదరాబాద్….కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్న సీఎం రేవంత్
న్యూఢిల్లీ, మార్చి 04: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. బుధవారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అందుకోసం అమిత్ షా కార్యాలయానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ ఐజీ సుమతి, ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ ఉన్నారు. అదీకాక ఇటీవల పలువురు మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహరెడ్డి తదితరులు తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు.
దేశంలో మావోయిస్టులు నిర్మూలించేందుకు కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం ఆపరేషన్ కగార్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ.. మార్చి మొదటి వారంలో అగ్రనేతలంతా ఒకేసారి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అలాగే మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు నేపాల్‌లో ఉన్నారంటూ వార్త కథనాలు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని సదరు కథనాల్లో స్పష్టం చేశారు. ఆయన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారాంటూ ప్రచారం సాగుతోంది.

ఇంకోవైపు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న గణపతి లొంగిపోవాలంటూ ఆయన సోదరుడు ఇప్పటికే మీడియా ద్వారా కోరిన విషయం విదితమే. ఈ మావోయిస్ట్ అగ్రనేతలు ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరి లొంగుబాటులో తెలంగాణ పోలీసులు అత్యంత కీలకంగా వ్యవహరించారనే ప్రచారం సాగుతోంది. అలాంటి వేళ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో డీజీపీతోపాటు సుమతి, విజయ్ కుమార్‌లను అమిత్ షా స్వయంగా అభినందించనున్నారని చర్చ నడుస్తోంది.