భారత్ న్యూస్ హైదరాబాద్….ఆ రెండు పథకాలను ఈ నెల 12న ప్రారంభించనున్న సీఎం

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని మరో కీలక ముందడుగు వేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు, వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారుల అభ్యున్నతి కోసం రూపొందించిన ‘భాల భరోసా’ మరియు ‘ప్రణామం’ పథకాలను ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టింది.
దివ్యాంగుల సాధికారతకు రూ.50 కోట్ల కేటాయింపు
దివ్యాంగుల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా రూ.43.22 కోట్ల విలువైన సహాయక పరికరాలను సుమారు 7 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ పరికరాల్లో రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
దివ్యాంగుల సహకార సంస్థ ఏర్పాటైన తర్వాత, ఒకే ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా నిలుస్తోంది. దివ్యాంగులు స్వావలంబనతో జీవించేందుకు ఇది కీలకంగా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రణామం – వృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లు
వృద్ధుల మానసిక ఉల్లాసం, భద్రత, సంరక్షణ లక్ష్యంగా ‘ప్రణామం’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, హన్మకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ డే కేర్ సెంటర్లలో లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, టీవీ, ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్లు అందుబాటులో ఉంటాయి. లబ్ధిదారులకు ఉచితంగా స్నాక్స్‌తో పాటు వేడి భోజనం అందించనున్నారు. ప్రతి సెంటర్ ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.12.48 లక్షలు మంజూరు చేసింది.
బాల భరోసా – చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది
ఐదేళ్లలోపు చిన్నారుల్లో వైకల్యాలను ముందస్తుగా గుర్తించి, సమయానికి చికిత్స అందించాలనే లక్ష్యంతో ‘బాల భరోసా’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నట్లు గుర్తించిన చిన్నారులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఆర్బీఎస్కే (RBSK) ద్వారా వైద్య పరీక్షలకు పంపిస్తారు.
అవసరమైన చిన్నారులకు ప్రభుత్వం ఉచితంగా శస్త్రచికిత్సలు, థెరపీ, పునరావాస సేవలు అందించనుంది. చిన్న వయసులోనే వైకల్యాలను గుర్తించి చికిత్స అందించడం ద్వారా వైకల్య రహిత తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు

దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల కోసం రూపొందించిన ఈ రెండు పథకాలు రాష్ట్రంలో సామాజిక భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఈ కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నాయి.