మండలి వెంకట కృష్ణారావు శత జయంతి చిహ్నం ఆవిష్కరించిన స్పీకర్

…భారత్ న్యూస్ హైదరాబాద్….మండలి వెంకట కృష్ణారావు శత జయంతి చిహ్నం ఆవిష్కరించిన స్పీకర్

చిహ్నంలో దివిసీమ ఉప్పెన సహాయక చర్యలు, ప్రపంచ తెలుగు మహాసభలకు స్థానం

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును అభినందించిన రఘురామ

హైదరాబాద్:

దివిసీమ గాంధీ, ఆర్త జన బంధువు, దివిసీమ పునర్నిర్మాత అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల చిహ్నం (లోగో)ను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు మంగళవారం హైదరాబాదులో ఆవిష్కరించారు. ఆగస్టు 4వ తేదీ నుంచి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు అవనిగడ్డ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల చిహ్నం (లోగో) తయారు చేయించారు. ఈ చిహ్నమును హైదరాబాదులో స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చేతులమీదుగా ఆవిష్కరింప చేశారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే దివిసీమ ఉప్పెన సహాయక చర్యలు, ప్రపంచ తెలుగు మహాసభలకు ఈ లోగోలో స్థానం కల్పించటం ద్వారా మండలి వెంకట కృష్ణారావు స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కలిగిందన్నారు. తండ్రి శత జయంతి వేడుకలు చేపట్టిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును రఘురామ కృష్ణంరాజు అభినందించారు.