భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణపై బీజేపీ ఒడిశా ఫార్ములా.. ప్లాన్ షురూ
బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ దక్షిణాదిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెంచనుంది
బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ దక్షిణాదిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెంచనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉండటంతో బీజేపీ తెలంగాణను తమ విజయానికి గేట్ వే గా మార్చుకోవాలని పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందుకోసమే ఇకపై కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణలో పర్యటిస్తూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రానున్న కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కూడా మంజూరయ్యే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పడం విశేషం. అంటే ఇక దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణను తమ అడ్డాగా చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. మరో మూడేళ్ల సమయం ఎన్నికలకు ఉండటంతో ఇక నాయకుల పర్యటనలతో తెలంగాణను హోరెత్తించనున్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో…
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది స్థానాలు రావడంతో ఇక్కడ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఎప్పటి నుంచో తెలంగాణపై బీజేపీ నాయకత్వం నజర్ పెట్టినా మొన్నటి ఎన్నికల్లో కొంత సానుకూల వాతావరణం కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక అసెంబ్లీ స్థానాలను గతంలో ఎన్నడూ లేని విధంగా కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ ఒడిశా ఫార్ములాను బీజేపీ ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు. ఒడిశాలోనూ తొలుత అక్కడ కాంగ్రెస్ ను బలహీనపర్చింది. తర్వాత నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ ను ఓడించి ఒడిశా రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది.
ఇక్కడ రివర్స్ లో…
అయితే ఇక్కడ ఆ ఫార్ములా రివర్స్ లో చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండుసార్లు అధికారాన్ని పొందిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ను తొలుత బలహీనం చేసిన తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ నుంచి అధికారాన్ని వేరు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. దేశంలో కర్ణాటక, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాలే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. వాటిని కూడా తమ చేతికి అందుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా కర్ణాటకలో ఈసారి తమదే అధికారం అని నమ్ముతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం, తెలంగాణలో మాత్రం పార్టీ నాయకత్వంతో పాటు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఒంటరిగానే తెలంగాణలో ఒంటిచేత్తో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.