గిరిజన హక్కుల పరిరక్షణకు పక్కా హామీ కావాలి: మైనింగ్ బిల్లుపై ఎంపీ మద్దిల గురుమూర్తి

భారత్ న్యూస్ ఢిల్లీ…..గిరిజన హక్కుల పరిరక్షణకు పక్కా హామీ కావాలి: మైనింగ్ బిల్లుపై ఎంపీ మద్దిల గురుమూర్తి

మైనింగ్ రంగానికి సంబంధించిన ప్రధాన సవరణలతో కూడిన మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు – 2025పై జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ బిల్లులోని కొన్ని అభివృద్ధి దిశగా తీసుకున్న చర్యలను స్వాగతించడంతో పాటు, కొన్ని లోపాలను హైలైట్ చేశారు.

ఈ బిల్లులో ముఖ్యంగా లోతైన ఖనిజాల అన్వేషణకు 10% నుంచి 30% వరకూ లీజు విస్తరణకు అవకాశం ఇవ్వడం, స్ట్రాటజిక్ మినరల్స్‌పై అదనపు ఛార్జీల మినహాయింపు, కాప్టివ్ మైన్స్ పై విక్రయ పరిమితుల తొలగింపు, ఖనిజాల ట్రేడింగ్ కోసం మినరల్ ఎక్స్చేంజ్‌ల ఏర్పాటు, నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ మార్పు వంటి సానుకూల అంశాలు ఉన్నాయని ఎంపీ తెలిపారు.

అయితే, ఈ బిల్లు గిరిజనుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణలు పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం, ఆర్టికల్ 338 ఏ(9) ప్రకారం గ్రామ సభల అనుమతి తప్పనిసరి అయినా, బిల్లులో వాటిని ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నారు. నియంగిరి, సమతా కేసులలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను బిల్లు విస్మరించడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన అన్నారు.

నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కొనసాగుతుండగా, చట్టబద్ధంగా నడుస్తున్న మైన్స్‌ను మూసివేయడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ.150 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పడిపోయిందని చెప్పారు. మూతపడిన మైన్స్ పారదర్శకంగా పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.9 వేల కోట్ల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిలో ఆర్‌బీఐ డైరెక్ట్ డెబిట్ మాండేట్ కలిగి ఉండటం వల్ల, ప్రైవేట్ డెబెంచర్ ట్రస్టీ ద్వారా స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా నిధులు విత్ డ్రా చేసే అవకాశం ఉందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) ఉల్లంఘనకు సమానమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, రాజకీయ కక్ష సాధింపులకు రాష్ట్ర యంత్రాంగాన్ని దుర్వినియోగం పేర్కొన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగ తనపై జరిగిన దాడిని, బెదిరింపులను, ఓటు హక్కు నుంచి తమను అడ్డుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే సహచర మిథున్ రెడ్డి అరెస్టు కూడా రాజకీయంగా ప్రేరితమైన చర్యలలో భాగమేనని విమర్శించారు.

చివరగా బిల్లులోని పాజిటివ్ అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగం, గిరిజన హక్కులు, ఆర్థిక పారదర్శకతను ఉల్లంఘించకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి మాధుర్యంగా ఉండాలే గానీ, అది న్యాయం, సమానత, ప్రజాస్వామ్యంపై దాడి అయ్యేలా ఉండకూడదని స్పష్టం చేస్తూ బిల్లుకి మద్దతు తెలిపారు.