ఢిల్లీ పేలుడు కేసు… ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కోసం పోలీసుల వేట

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ పేలుడు కేసు… ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కోసం పోలీసుల వేట

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎర్రకోట పేలుళ్ల కేసులో మరో కారు కోసం పోలీసుల గాలింపు

ఎర్ర రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారుపై అనుమానాలు

కేసు దర్యాప్తును చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)

దర్యాప్తు కోసం 10 మంది అధికారులతో ఎన్ఐఏ ప్రత్యేక బృందం

పేలుళ్లలో గాయపడిన వారిని పరామర్శించిన ప్రధాని మోదీ

ఢిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉగ్రదాడిలో మరో కారును కూడా వాడినట్లు అనుమానిస్తున్న ఢిల్లీ పోలీసులు, ఎరుపు రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు బుధవారం హై అలర్ట్ జారీ చేసి, ఐదు ప్రత్యేక బృందాలతో వేట మొదలుపెట్టారు.

ఉగ్రవాదులు ఐ20 కారుతో పాటు మరో ఎరుపు రంగు కారును కూడా వినియోగించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులు, సరిహద్దు చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్, హర్యానా పోలీసులకు కూడా ఈ కారుపై సమాచారం అందించి అప్రమత్తం చేశారు.

ఈ కేసు దర్యాప్తును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎన్ఐఏ ఏడీజీ విజయ్ సఖారే నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఒక ఐజీ, ఇద్దరు డీఐజీలు, ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు డీఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారు.

ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీనిపై స్పష్టత కోసం 1,000కి పైగా సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా కార్యకలాపాలు, మొబైల్ ఫోన్ డంప్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు.