.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రపంచానికే పెనుముప్పుగా ట్రంప్ !
పిచ్చోడి చేతికి రాయి దొరికినట్లుగా ట్రంప్ చేతికి అమెరికా అధ్యక్ష పదవి దక్కడం ఇప్పుడు ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కేవలం రాజకీయ మార్పులే కాకుండా, ఆధునిక నాగరికతకే పెను ముప్పుగా పరిణమిస్తున్నాయన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అపహరించడం , గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకుంటామనే హెచ్చరికలు .. అంతటితో ఆగేది లేదని చేస్తున్న ప్రకటనలు దీనికి కారణం.
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన
ట్రంప్ తన రెండో విడత పాలనలో అంతర్జాతీయ నిబంధనలను పూర్తిగా పక్కన పెడుతున్నారు. వెనిజులాలో సైనిక జోక్యం ద్వారా మదురోను బంధించడం, క్యూబా, కొలంబియా వంటి దేశాలపై ఆంక్షలు విధించడం, డెన్మార్క్ పరిధిలోని గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకుంటామనే బెదిరింపులు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. నాగరిక సమాజం అంటే బలవంతుడు బలహీనుడిని వేధించకుండా ఉండటం.. కానీ ట్రంప్ చర్యలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
ప్రపంచాన్ని అస్థిరత వైపు నడిపిస్తున్న ట్రంప్ అహంకారం
అమెరికా కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ల మద్దతు సుప్రీంకోర్టు అనుకూల నిర్ణయాలతో ట్రంప్ తన అధ్యక్ష పదవిని ఒక నియంత తరహా అధికారంగా మార్చుకున్నారు . చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం ఇక్కడ పనిచేయడం లేదని, ఇది అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను ఒక మాఫియా స్టేట్ తరహాలో మారుస్తోంది. అధ్యక్షుడి అహంకారం , సర్వశక్తివంతుడిననే భావన ప్రపంచాన్ని అస్థిరత వైపు నడిపిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న దాదాపు 66 అంతర్జాతీయ సంస్థల నుండి అమెరికాను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో పర్యావరణ మార్పులపై పోరాడే IPCC , UNFCCC వంటి కీలక సంస్థలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్‌ను ఒక మోసం గా కొట్టిపారేస్తూ, శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంచడం ద్వారా రాబోయే తరాల మనుగడను ట్రంప్ ప్రమాదంలో పడేస్తున్నారు.
ప్రపంచ యుద్ధ ముప్పు?
చరిత్రను గమనిస్తే, ఏకపక్ష నిర్ణయాలు , అదుపులేని అధికార కాంక్షే ప్రపంచ యుద్ధాలకు దారితీశాయని, ఇప్పుడు ట్రంప్ తీరు కూడా అదే దిశలో సాగుతోంది. తన వ్యక్తిగత పేరు కోసం గ్రీన్లాండ్ వంటి భూభాగాలను ఆశించడం, మిత్రదేశాలైన నాటో సభ్యులపై కూడా ఒత్తిడి పెంచడం చేటు తెచ్చే పరిణామాలు. ఇలాగే కొనసాగితే ప్రపంచం అరాచకత్వం , యుద్ధం వైపు మళ్లే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న భయం. ట్రంప్ దీన్ని తెచ్చి పెట్టినా ఆశ్చర్యం ఉండదు.
