నైజీరియాలో మృత్యుఘోష: మసీదులో బాంబు పేలుడు.. ప్రార్థనల్లో ఉన్న 10 మంది మృతి!

భారత్ న్యూస్ అనంతపురం.నైజీరియాలో మృత్యుఘోష: మసీదులో బాంబు పేలుడు.. ప్రార్థనల్లో ఉన్న 10 మంది మృతి!

బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలో ఘటన

రద్దీగా ఉండే మసీదులో ప్రార్థనలో సమయంలో భీకర శబ్దంతో బాంబు పేలుడు

ఆత్మాహుతి దాడిగా అనుమానం

బాధ్యత ప్రకటించని ఉగ్రవాద సంస్థలు

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని ఒక మసీదులో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో భీకర బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గంబోరు మార్కెట్ ప్రాంతంలోని రద్దీగా ఉండే మసీదులో ఈ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి.

సాయంత్రం వేళ ముస్లింలు పెద్ద సంఖ్యలో మసీదుకు చేరుకుని ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా ఈ పేలుడు జరిగింది. మసీదు లోపల ముందే అమర్చిన బాంబు పేలి ఉండవచ్చని లేదా ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చని స్థానిక మిలీషియా నాయకులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి మసీదు శిథిలాలు భక్తులపై పడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు సమాచారం.

ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించనప్పటికీ, ఈ ప్రాంతంలో బలంగా ఉన్న ‘బోకో హరామ్’ లేదా ఐసిస్ గ్రూపుల పనే అయి ఉంటుందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. 2009 నుంచి నైజీరియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా సాగుతున్న ఈ ఉగ్రవాద పోరులో ఇప్పటివరకు సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

గత కొన్నేళ్లుగా మైదుగురి నగరంలో పెద్దగా దాడులు జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ మసీదునే లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. నైజీరియా సైన్యం నిరంతర నిఘా పెట్టినప్పటికీ, ఉగ్రవాద గ్రూపులు ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడుతుండటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, ఈ ప్రాంతంలో హింస తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తున్నా, పొరుగు దేశాలైన నైగర్, చాద్‌లకు కూడా ఈ ఉగ్రవాదం వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.