భారత్ న్యూస్ అనంతపురం..రష్యా చమురు కొనండి.. భారత్‌కు అమెరికా అనుమతి*
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అమెరికా అనుమతినివ్వడంపై దేశంలో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అమెరికా బ్లాక్‌మెయిల్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని, ఇది అత్యంత సిగ్గుచేటు అని విరుచుకుపడ్డాయి. భారత సార్వభౌమత్వం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్, అదానీ కేసు కారణంగా అమెరికాకు మోదీ లొంగిపోయారని, బ్లాక్‌మెయిల్‌కు గురవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం వరుసగా ‘దౌత్యపరమైన ఆధిపత్యాన్ని వదులుకుంటున్నది’ అని వ్యాఖ్యానించారు.

అమెరికా తన సామంత దేశాలకు ఆంక్షలు విధించుకోవాలి, భారత్‌కు కాదు. ప్రపంచంలో భారత్ కూడా బాధ్యతాయుతమైన, సమాన భాగస్వామి. కానీ వాణిజ్యం నుంచి చమురు వరకు, డాటా నుంచి మిత్ర దేశాలతో దీర్ఘకాలిక సంబంధాల వరకు అన్నింటినీ మోదీ అమెరికాకు అప్పగించేశారు’ అని దుయ్యబట్టారు. తన గమ్యాన్ని తానే నిర్దేశించుకొనే గర్వించదగిన రికార్డు భారత్‌కు ఉండేదని, కానీ ఇప్పుడు అది మసకబారిందని విపక్ష నేతలు విమర్శించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీతోపాటు వాజ్‌పేయి సహా ఏ ప్రధానీ ఇలా విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదని గుర్తుచేశారు.