భారత్ న్యూస్ ఢిల్లీ…..వెగోవీ’ని భారత మార్కెట్లో విడుదల చేసిన నోవో నార్డిస్క్
వారానికొకటి చొప్పున నెలకు 4
నాలుగు డోసుల ధర రూ.17,345 నుంచి మొదలు
బాడీ మాస్ ఇండెక్స్ 30కి మించి ఉన్నవారికి మాత్రమే
న్యూఢిల్లీ,: అధిక బరువుకు, ఊబకాయానికి చెక్ పెట్టే మరో ఇంజెక్షన్ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. డానిష్ పార్మా కంపెనీ నోవోనార్డిస్క్.. తాను తయారుచేసిన ‘వెగోవీ’ ఇంజెక్షన్‌ను మంగళవారం మన మార్కెట్లో విడుదల చేసింది. స్థూలకాయంతో బాధపడేవారు.. వైద్యుల సిఫారసుతో వారానికి ఒకసారి ఈ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషధాన్ని సెమాగ్లూటైడ్ అనే జీఎల్పీ 1ఏ రిసెప్టర్‌తో తయారుచేశారు. మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే జీఎల్పీ-1 రిసెప్టర్లాగా పనిచేస్తుందిది. ఈ రిసెప్టర్ మన రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో, ఆకలిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహారం కడుపులో నుంచి చిన్నపేగుల్లోకి వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో ఆహారం ఎక్కువసేపు కడుపులో ఉండి.. మనకు త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గడానికే కాక.. మధుమేహ నియంత్రణకు, గుండె వైఫల్యాన్ని నియంత్రించడానికి కూడా వెగోవీ ఉపయోగపడుతుందని.. ఫ్యాటీలివర్‌ను నియంత్రణలో ఉంచుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. వెగోవీని వాడినవారు 10 నుంచి 15 శాతం మేర బరువు తగ్గుతారని అంచనా. నిజానికి.. బరువు తగ్గడానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిన ఔషధాలు రెండు ఇప్పటికే ఉన్నాయి. అవి.. ఒజెంపిక్, మౌంజారో. వీటిలో ‘ఒజెంపిక్’.. వెగోవీ తరహాలోనే పనిచేస్తుంది. రెండింటిలోనూ ఒకే ఔషధం ఉంటుంది. కానీ దాన్ని ప్రధానంగా మధుమేహ నియంత్రణకు ఉపయోగిస్తారు (మనదేశంలో ఒజెంపిక్ వాడకం తక్కువ. పాశ్చాత్య దేశాల్లో అధికం). ఇక.. మరో ఔషధం మౌంజారోను టిర్జెపటైడ్తో తయారు చేస్తారు. అది జీఐపీ, జీఎల్పీ-1 రిసెప్టర్లు రెండింటి తరహాలో పనిచేస్తుంది. ఈ మందును మనదేశంలో మధుమేహ నియంత్రణకు, బరువు తగ్గడానికి.. రెండింటికీ సిఫారసు చేస్తున్నారు.
వెగోవీ.. ధర ఎక్కువే..
ఈ మందు.. 0.25 మిల్లీగ్రాములు, 0.5 మి.గ్రా, 1 మి.గ్రా, 1.7 మి.గ్రా, 2.4 మి.గ్రా మోతాదుల్లో లభిస్తుంది. ఒకే ఇంజెక్షన్లో (డెలివరీ డివైస్) నాలుగు మోతాదుల మందు ఉంటుంది. వీటిలో.. 0.25 మిల్లీ గ్రాముల నుంచి 1 మిల్లీగ్రాము దాకా ఏ డోసు డెలివరీ డివైస్ తీసుకున్నా.. ధర రూ.17,345. ఇక.. 1.7 మిల్లీగ్రాముల మందు నాలుగు డోసులున్న ఇంజెక్షన్ వెల రూ.24,280. అదే.. 2.4 మిల్లీగ్రాముల మందు నాలుగు డోసుల వెల అయితే.. రూ.26,015. మొదటి నాలుగు డోసుల తర్వాత.. ఫలితాల ఆధారంగా తర్వాతి డోసులను వైద్యులు నిర్ధారిస్తారు.
అందరికీ ఇవ్వరు
వెగోవీని వైద్యులు ఎవరు పడితే వారికి సిఫారసు చేయరు. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30కి మించి ఉన్నవారికి (లేదా) బీఎంఐ 27 అంతకు మించి ఉండి, దాంతోపాటే రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్/ట్రైగ్లిజరైడ్స్ స్థాయులు ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ ఇంజెక్షన్‌ను సిఫారసు చేస్తారు.
