క్యాన్సర్‌ కణాల వెనుక అదృశ్య శక్తి

భారత్ న్యూస్ అనంతపురం..క్యాన్సర్‌ కణాల వెనుక అదృశ్య శక్తి

దిల్లీ: మానవ శరీరంలోని కణాలు.. కణజాలాలు, ఎముకలు, అవయవాల వంటి భౌతిక రూపాలను తాకకుండానే అనుభూతి చెందగలవని ఓ అధ్యయనం వెల్లడించింది, క్యాన్సర్‌ కణాలకు 10 మైక్రాన్‌ల దూరంలోని వాటిని అనుభూతి చెందగలిగే శక్తి ఉంటుందని.. సాధారణ కణాలు ఒకేసారి కలిసికట్టుగా ప్రయత్నిస్తే 100 మైక్రాన్‌ల దూరంలోని వాటినీ పసిగట్టగలవని పేర్కొంది.

అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కణాలకున్న ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని పరిశోధకులు ‘డెప్త్‌ మెకానో సెన్సింగ్‌’గా వ్యవహరిస్తున్నారు.

వాషింగ్టన్‌ యూనివర్సిటీ-స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్, మెటీరియల్‌ సైన్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమిత్‌ పాఠక్‌ ఈ అధ్యయనంలో కీలకపాత్ర పోషించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘కణాలు వాటి చుట్టూ ఉండే కొలాజెన్‌ ఫైబర్‌ను నెట్టడం ద్వారా తమకు సమీపంలో ఉన్నది మెత్తని కణజాలమా, ఎముకా? లేదా కణితా అనేది తెలుసుకుంటున్నాయి. తద్వారా తమకు అనుకూలంగా ఉన్న మార్గంలో ప్రయాణిస్తున్నాయి.

క్యాన్సర్‌ కణాలు ఇదే నైపుణ్యాన్ని ఉపయోగించి కణితి నుంచి వెలుపలికి వ్యాపిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఆ  తర్వాత అవి పరిశీలనకు దొరకకుండా నేరుగా కణజాలాలను ఆక్రమిస్తున్నాయి. క్యాన్సర్‌ కణాలకున్న ఈ సామర్థ్యాన్ని ఏదో రకంగా నిలువరించగలిగితే ఆ సమస్య శరీరం మొత్తానికి వ్యాపించకుండా రక్షించవచ్చు.
ఆ దిశలో పరిశోధనలు సాగుతున్నాయి’’ అని వివరించారు.