భారత్ న్యూస్ కడప …పూరీ జగన్నాథుడికి పవిత్ర స్నానం- బంగారు బావి నుంచి 108 బంగారు కుండల్లో సేకరించే జలాలే కీలకం- ఏటా ఒకే ఒక్కసారి తెరుచుకోవడం దీని ప్రత్యేకత
ఒడిశాలోని పూరీకి జగన్నాథ్ ధామ్, శ్రీక్షేత్ర అనే పేర్లు ఉన్నాయి. పూరి జగన్నాథుడి వస్త్రధారణ నుంచి ఆలయ ఆచారాల దాకా ప్రతీదీ ప్రత్యేకమైనవే. జగన్నాథ ఆలయంలోని పూరీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర, సుదర్శన చక్రాలను కలిపి చతుర్ధమూర్తి అంటారు. అసంఖ్యాక భక్తజనానికి దర్శనమిచ్చేందుకు చతుర్ధమూర్తి రత్నసింహాసనం దిగి బయటికి విచ్చేసారు. బుధవారం రోజు (జూన్ 11న) దేవస్నాన పూర్ణిమ వేళ ఈ అపూర్వ ఘట్టం జరగింది. పూరీ జగన్నాథుడి ఆలయంలోని దేవతామూర్తులను స్నాన బేది అనే ప్రదేశానికి తీసుకెళ్లారు. బంగారు బావి నుంచి 108 బంగారు కుండల్లో నీటిని సేకరించి వాటికి పవిత్ర స్నానం చేయించారు.
బంగారు బావి ఎక్కడుంది?
పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో చాలా బావులు ఉన్నాయి. ఆలయం ఉత్తర ద్వారం వద్దనున్న ఉద్యానవనం ఎదుట ఒక బావి ఉంది. దీన్నే బంగారు బావి అని పిలుస్తారు. ఇది ఏడాది పొడవునా మూసివేసి ఉంటుంది. ఈ బావిలోని నీటిని ఇతర సమయాల్లో అస్సలు ఉపయోగించరు. కేవలం పూరీ జగన్నాథ స్వామి స్నాన యాత్ర సమయంలో మాత్రమే బంగారు బావిని తెరుస్తారు. స్వామివారి స్నానానికి ఒక రోజు ముందు ఆలయ జైన సేవకుడు దయాన మాలి ఈ బావిని తెరిచి శుద్ధి చేస్తాడు. అందులోకి స్వర్ణ హంసను వదిలాక, బంగారు కుండలతో నీటిని సేకరించడం మొదలుపెడతాడు. ఈ నీటితో స్వామివారికి, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాలకు బుధవారం(జూన్ 11న) స్నానం చేయిస్తారు.
ఎవరెవరికి ఎన్నెన్ని బంగారు కుండలు?
దేవతామూర్తులను స్నాన బేది వద్ద మూడు పెద్ద పీఠాలపై కూర్చోబెట్టి, వాటి చుట్టూ చాలా రకాల కాటన్ వస్త్రాలను చుడతారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ దేవతామూర్తుల స్నానఘట్టం ప్రారంభమవుతుంది. 108బంగారు కుండల్లో ఉన్న బంగారు బావి నీటితో పూరీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాలకు స్నానం చేయిస్తారు. ఈ స్నానపు నీటిలో కస్తూరి, కుంకుమ పువ్వు, చందనం వంటి వివిధ ఔషధ మూలికలను కలుపుతారు. పూరీ జగన్నాథుడి స్నానానికి 35 బంగారు కుండలు, బలభద్ర కోసం 33, సుభద్ర కోసం 22, సుదర్శన చక్రం కోసం 18 బంగారు కుండల నీటిని వినియోగిస్తారు.
