భారత్ న్యూస్ విజయవాడ…మహిళ స్కూటీని ఢీకొట్టిన స్పీడ్ కార్, వెంటనే స్పందించిన బెజవాడ ట్రాఫిక్ పోలీసులు
విజయవాడ BRTS రోడ్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. సిగ్నల్ గ్రీన్ ఉండగా వాహనాలు ముందుకు కదులుతున్న సమయంలో పసుపు (Yellow) సిగ్నల్ వెలిగింది. ఈ సందర్భంలో చాలామంది డ్రైవర్లు స్పీడ్ తగ్గించి ఆగేందుకు ప్రయత్నించగా, ఒక కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వేగంగా ముందుకు దూసుకెళ్లాడు.
ఇంతలో వ్యతిరేక దిశలో గ్రీన్ సిగ్నల్ పడడంతో వాహనాలు కదలడం ప్రారంభించాయి. ఆ సమయంలో స్కూటీపై వస్తున్న ఒక మహిళను, వేగంగా వచ్చిన ఆ కారు ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో స్కూటీపై ఉన్న మహిళ రోడ్డుపై పడిపోగా, ఆమె కాలు విరిగింది .
ప్రమాదాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి, గాయపడిన మహిళను ఆటోలో హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు

వాహనదారులు సిగ్నల్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, పసుపు సిగ్నల్ సమయంలో వేగం పెంచి దాటే ప్రయత్నాలు చేయొద్దని బెజవాడ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు