టీటీడీ మాజీ అధికారి సతీశ్ కుమార్ కేసులో కీలక అంశం వెలుగులోకి!

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ మాజీ అధికారి సతీశ్ కుమార్ కేసులో కీలక అంశం వెలుగులోకి!

Ammiraju Udaya Shankar.sharma News Editor…రైల్వే టీసీ, ఇతర సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు

ఘటనా స్థలంలో రైల్వే ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్

రన్నింగ్ రైలు నుంచి బొమ్మలను కిందకు తోసి పరిశీలన

డ్రోన్ కెమెరాల సహాయంతో ఘటన చిత్రీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ అనుమానాస్పద మృతి కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణించిన రైలులో లభించిన లగేజీ బ్యాగ్‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు పోలీసులు సంఘటనా స్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో విధులు నిర్వర్తించిన టీసీ, ఇతర సిబ్బందితో పాటు బెడ్‌రోల్ అటెండర్లు రాజీవ్ రతన్, కృష్ణయ్యలను రైల్వే పోలీసులు నిన్న విచారించారు. సతీష్‌కుమార్‌కు కేటాయించిన సీటు నంబర్ 29 కాగా, ఆయన లగేజీ బ్యాగ్ 11వ నంబర్ సీటు వద్ద ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. తిరుపతి ఆర్పీఎఫ్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ఈ బ్యాగ్‌ను అప్పగించారు. దీంతో అసలు ఆయన బ్యాగ్ అక్కడికి ఎలా చేరిందనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరోవైపు, అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి వద్ద సతీష్‌కుమార్ మృతదేహం లభ్యమైన ప్రాంతంలో రైల్వే ఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. గుత్తి నుంచి తిరుపతి వెళ్తున్న రన్నింగ్ రైలు నుంచి రెండు బొమ్మలను కిందకు తోసివేశారు. ఒకటి కూర్చున్న స్థితిలో, మరొకటి నిలబడిన స్థితిలో తోసి, డ్రోన్ కెమెరాల సహాయంతో మొత్తం ఘటనను చిత్రీకరించారు. సుమారు 5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ రెండు పరిణామాలతో కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది.