భారత్ న్యూస్ డిజిటల్. అమరావతి: గుంటూరు జిల్లా పోలీస్:
13 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, నడిరోడ్డుపై నడిపిస్తూ న్యాయస్థానానికి తరలించిన మంగళగిరి టౌన్ పోలీసులు,.//
ఈ నెల 18వ తేదీ రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో, మంగళగిరి టౌన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో 13 ఏళ్ల మైనర్ బాలికను నలుగురు నిందితులు మాటల్లో పెట్టి, ఒక ఆటోలో ఎక్కించుకొని వివిధ నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ తెలిపారు.
అత్యాచారం అనంతరం బాలిక కేకలు వేయడంతో, స్థానికులు స్పందించి ఆమెను రక్షించగా, బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన ఘటనను తన తల్లికి వివరించిందని, బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు.
దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు, ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడే వారిపై చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో, గుంటూరు నార్త్ డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో, మంగళగిరి టౌన్ సీఐ శ్రీ వీరాస్వామి గారు తమ సిబ్బందితో కలిసి నిందితులను పోలీస్ స్టేషన్ నుండి నడిరోడ్డుపై నడిపిస్తూ న్యాయస్థానానికి తరలించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ గారు మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికల భద్రత, రక్షణకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను ఏ మాత్రం సహించబోమని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

👉 అలాగే మహిళలు మరియు బాలికలపై ఎక్కడైనా నేరాలు జరిగినట్లు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా పోలీస్ అధికారులను, డయల్ 112 నంబర్ ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు.