ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు, పాతబస్తీలో తనిఖీలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు, పాతబస్తీలో తనిఖీలు

రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని, నాకా బందీ చేపట్టాలని ఆదేశం

సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచాలన్న సజ్జనార్

అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచన

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాకాబందీ చేపట్టాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీ నగరం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. దేశ రాజధానిలో పేలుడు సంభవించడంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హై అలెర్ట్‌ ప్రకటించారు.

ఈ క్రమంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అప్రమత్తమైన పోలీసులు పాతబస్తీలోనూ విస్తృత తనిఖీలు చేపట్టారు. అన్ని రైల్వే స్టేషన్‌లలో బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.