మాదక ద్రవ్య రహిత గుంటూరు జిల్లానే లక్ష్యం. – జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్,.//

భారత్ న్యూస్ డిజిటల్:అమరావతి:

//మాదక ద్రవ్య రహిత గుంటూరు జిల్లానే లక్ష్యం. – జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్,.//

📍 “డ్రగ్స్ వద్దు బ్రో”, “సంకల్పం” కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు.

గుంటూరు జిల్లాను సంపూర్ణ మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యంగా గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి సారథ్యంలో “సంకల్పం మరియు డ్రగ్స్ వద్దు బ్రో ” అనే కార్యక్రమాల ద్వారా గుంటూరు జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమాలలో భాగంగా “డ్రగ్స్ వద్దు బ్రో”, “మాదక ద్రవ్యాలే యువతకు శత్రువు – అవగాహనతోనే రక్షణ”, “చెడు అలవాట్లకు చెక్… మంచి భవిష్యత్తుకు సంకల్పం”, “డ్రగ్స్ జోలికి వెళ్తే కలలు గల్లంతే”, “యువతే దేశ సంపద – డ్రగ్స్‌కు నో చెప్పాలి” వంటి ప్రభావవంతమైన నినాదాలతో ముఖ్యంగా విద్యార్థులు, యువతలో చైతన్యం తీసుకువస్తున్నారు.

ఈ రోజు (24.12.2025) తాడేపల్లి, మంగళగిరి టౌన్, మంగళగిరి రూరల్, ప్రత్తిపాడు, తెనాలి 3 టౌన్, ఓల్డ్ గుంటూరు, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో “డ్రగ్స్ వద్దు బ్రో” మరియు “సంకల్పం” అవగాహన కార్యక్రమాలను పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, విద్యార్థులు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల అలవాటు వల్ల చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం, సమాజంలో గౌరవం అన్నీ తీవ్రంగా దెబ్బతింటాయని, చివరకు బంగారు భవిష్యత్తే నాశనం అవుతుందని వివరించారు.

మాదక ద్రవ్యాల వినియోగం శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతుందని, ఒకసారి బానిసలైతే వాటి నుంచి బయటపడటం అత్యంత కష్టమని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల నేరప్రవృత్తి పెరిగే ప్రమాదం ఉండటంతో పాటు చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని తెలిపారు. అందుకే విద్యార్థులు చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సానుకూల కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు.

విద్యార్థులు చెడు మార్గాల్లోకి వెళ్లకుండా సక్రమమైన దారిలో నడిచి తమ భవిష్యత్తును సుస్థిరంగా నిర్మించుకోవాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ గారు ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమం “సంకల్పం”లో భాగంగా విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల వినియోగం చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, డ్రగ్స్‌కు సంబంధించిన ఏవైనా సమాచారం తెలిసిన వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్ లేదా 112 / 100 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమాలలో పోలీస్ అధికారులు, విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.