నూతన మార్కాపురం జిల్లాలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

భారత్ న్యూస్ డిజిటల్::అమరావతి:

నూతన మార్కాపురం జిల్లాలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాకు గౌరవ వందనం చేసిన జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు మరియు ప్రజలు

సోమవారం మార్కాపురంలోని ఎస్వికెపి కళాశాల మైదానంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ శ్రీ.పులి శ్రీనివాసులు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఓపెన్ టాప్ వాహనంలో మార్కాపురం డి.ఎస్.పి. శ్రీ.ఉప్పుటూరి నాగరాజు గారితో కలిసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి ప్రత్యేకంగా అలంకరించిన పెరేడ్ వాహనాన్ని ఎక్కి జాయింట్ కలెక్టర్ మరియు డిఎస్పీ గారితో కలసి పోలీసు పెరేడ్‌ను పరిశీలించారు. పెరేడ్ కమాండర్‌గా ఏఆర్ఎస్సై సురేష్ గారి ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు, హోమ్ గార్డ్స్ మరియు ఎన్‌సీసీ క్యాడెట్లు కలిపి మొత్తం 5 ప్లాటూన్లు కవాతు నిర్వహించాయి. జాతీయ సమైక్యతను చాటుతూ, దేశభక్తి ఉప్పొంగేలా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మరియు కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకాన్ని ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ గారు ప్రసంగించారు.

ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అందిస్తున్న పౌర సేవలను తెలియజేసేలా వ్యవసాయ, ఉద్యాన, విద్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ( వెలుగు ), వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ – గ్రామ / వార్డు సచివాలయాలు, పశు సంవర్ధక – మత్స్య శాఖ, డ్వామా, ఏపీఎస్ఆర్టీసీ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు  ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనకుగాను పంచాయతీ రాజ్ శాఖకు మొదటి బహుమతి, డ్వామా శాఖకు ద్వితీయ బహుమతి, వ్యవసాయ – ఉద్యానవన శాఖకు తృతీయ బహుమతి లభించాయి. ఏపీఎస్ ఆర్టీసీకి కన్సోలేషన్ బహుమతి వచ్చింది.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ వేడుకలలో 17 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ ప్రదర్శనలకుగాను అన్ని బృందాలకు జాయింట్ కలెక్టర్ గారు బహుమతులు అందచేశారు.

ప్రభుత్వ పథకాలు తెలిపేలా స్టాల్స్
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు,  సంక్షేమ కార్యక్రమాలను వివరించేలా వ్యవసాయ, జల వనరులు, గ్రామీణ నీటిపారుదల, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా ), గనులు – భూగర్భ శాఖ – జిల్లా పరిశ్రమల కేంద్రం, జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ( వెలుగు ), మహిళాభివృద్ధి – శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ ( పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్ ), ఉద్యాన శాఖ – మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ , పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ, విద్యాశాఖ ( పురాతన నాణెములు – పోస్టల్ స్టాంపులు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ )లు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. జాయింట్ కలెక్టర్, డి.ఎస్.పి, డీఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ వీటిని సందర్శించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు కూడా ఆసక్తిగా వీటిని తిలకించారు. ఈ స్టాల్స్ ఏర్పాటుకుగాను గ్రామీణ నీటిపారుదల శాఖకు ప్రధమ, అటవీశాఖకు ద్వితీయ, గనులు – భూగర్భ శాఖకు తృతీయ బహుమతులు వచ్చాయి. స్టాల్స్ ఏర్పాటుచేసిన ఇతర అన్ని శాఖలకు కూడా బహుమతులను ప్రధానం చేశారు.

సేవలకు ప్రశంసాపత్రాలు
తమ విధుల పట్ల ఉత్తమ సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు మొత్తం 255 మందికి ప్రశంసా పత్రాలను జాయింట్ కలెక్టర్ ప్రదానం చేశారు. పోలీస్ పరేడ్ నిర్వహించిన ఎన్.సీ.సీ. విద్యార్థులకు కూడా ప్రశంస పత్రాలను ఇచ్చారు.

స్వాతంత్ర్య ‘ కుటుంబాలకు సన్మానం
కొనకనమిట్ల మండలం మునగపాడు గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు కైపు వీరారెడ్డి కుటుంబ సభ్యులను, కంభం మండలం తురి మెళ్ళ గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు బెల్లంకొండ వెంకట రంగయ్య కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్, డీఎస్పీ, డీఎఫ్ఓ ,ప్రజా ప్రతినిధులు సత్కరించి గౌరవించారు.

ఈ వేడుకల్లో  ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ. కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ. ముత్తుమల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే శ్రీ. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ శ్రీ.గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం సీఐ సుబ్బారావు,పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.