భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…5 రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్…
రూ.95 కోట్లు మోసం చేసిన 81 మంది.
ఏపీ సహా పలు రాష్ట్రాల్లో 81 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
దేశవ్యాప్తంగా 754 కేసుల్లో నిందితులుగా గుర్తింపు
మొత్తం రూ.95 కోట్ల మేర మోసాలకు పాల్పడిన ముఠా
నిందితుల ఖాతాల్లోని కోట్లాది రూపాయలు ఫ్రీజ్
డబ్బును బాధితులకు తిరిగి అందజేస్తామన్న పోలీసులు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, రూ.95 కోట్ల మేర మోసాలకు పాల్పడిన 81 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసింది. వీరిపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ పోలీసుల కథనం ప్రకారం, సైబర్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో… ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 81 మందిని అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో 17 మంది ఏజెంట్లు, ఏడుగురు మహిళలు, 58 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు.

నిందితుల నుంచి 84 సెల్‌ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న కోట్లాది రూపాయల నగదును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. ఈ అరెస్టులతో దేశంలోని అనేక సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడినట్లయిందని అధికారులు తెలిపారు.